Heavy Floods: ఖమ్మం జిల్లాలో మున్నేరు వరదల్లో చిక్కుకున్న ఏడుగురి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చేందుకు సిబ్బంది చాలా కృషి చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఉండి సహాయక చర్యలు చేపడుతున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేశారు. మున్నేరు వరద ఉద్ధృతి, సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయని ముఖ్యమంత్రి మంత్రి పువ్వాడను అడిగి తెలుసుకుంటున్నారు. వరద ప్రవాహంలో ఓ ఇంట్లో చిక్కుకున్న ఏడుగురిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఖమ్మం తరలించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో సహా భద్రాచలం నుంచి మంత్రి పువ్వాడ ఖమ్మంకు వెళ్లారు. మున్నేరు ప్రవాహంలో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేసినట్లు మంత్రి పువ్వాడ వెల్లడించారు. విశాఖ నుంచి భద్రాచలం వస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని మార్గమధ్యంలో ఖమ్మం మళ్లించాలని సీఎం చెప్పినట్లు వివరించారు. ఆయన ఆదేశాల మేరకు రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయని... ప్రత్యేక డ్రోన్ ద్వారా ఇంట్లో చిక్కుకున్న ఏడుగురి పరిస్థితిపై ఆరా తీస్తున్నట్లు ఖణ్మం జిల్లా అధికారులు వెల్లడించారు.
ఖమ్మం నగరంలోని పద్మావతి నగర్ ధ్యాన మందిరంలో ఉన్న ఏడుగురిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. వరద ఉద్ధృతితో సహాయక చర్యలకు తీవ్ర ఆంటంకం కల్గుతోంది. అయితే మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, అదనపు కలెక్టర్ ప్రియాంక సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మున్నేరు వరదల్లో చిక్కిన శ్రీరామ చంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన మందిరంలోని ఏడుగురు పేర్లను తెలిపారు. 55 ఏళ్ల లక్ష్మీ నారాయణ, 50 ఏళ్ల లక్ష్మీ, 26 ఏళ్ల యశ్వంత్, 34 ఏళ్ల అరవింద్, రెండేళ్ల విఘ్నేష్, 27 ఏళ్ల ప్రవల్లిక, 26 ఏళ్ల కావ్యగా గుర్తించారు. ఆ ఏడుగురు బాధితులను అధికారులు సురక్షితంగా రక్షించారు.
అలాగే నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. పరిస్థితులను ఎదుర్కొనేలా చర్యలు చేపట్టాలని లోతట్టు ప్రాంతాలైన వెంకటేశ్వర నగర్, మోతీ నగర్, బొక్కల గడ్డ, జలగం నగర్, FCI, దానవాయి గూడెం ప్రజలను పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి అధికారులకు సూచించారు ప్రజలు అధికారులకు సహకరించి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని వివరించారు. ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం.. ప్రభుత్వం నయాబజార్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.