Harish Rao criticized Telangana government :  తెలంగాణలో తాగునీరు సమస్యగా మారిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. తాగునీటి కోసం పలు ప్రాంతాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారని, దీంతో కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో తాగునీటి సమస్యపై మాజీ మంత్రి హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని తన ట్వీట్‌కు హరీష్ రావు జత చేశారు.                                                     


గుక్కెడు మంచి నీళ్ల కోసం ప్రజలు రొడ్లెక్కుతున్నారని పేర్కొన్నారు. ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారని, ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. గత కాంగ్రెస్ పాలనలోని నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయని ఆరోపించారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి, దృశాలు ఎప్పుడూ కనిపించలేదన్నారు. మారుమూల తండాల్లోనూ మిషన్ భగీరథ జలధార సమృద్ధిగా వచ్చేదని, పంటలకు సాగునీళ్లు ఎలాగూ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ప్రజలకు గొంతు తడుపుకోడానికి మంచినీళ్ళయినా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.   


 







తాగునీటికి ఇబ్బంది లేదన్న ప్రభుత్వం                                                      


రాష్ట్రంలోని ప్రధాన మూడు జలాశయాలైన శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, నాగార్జున సాగర్‌లలో గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ సరిపడా నీటి లభ్యత ఉన్నందున ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందే ప్రకటించింది.  రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ‘వేసవి కార్యాచరణ ప్రణాళిక’ను రూపొందించి జిల్లాలకు తగు నిధులను కూడా విడుదల చేసినట్లు తెలిపింది.  తాగునీటి సరఫరా విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని  ఇప్పటికే బోరు బావుల ఫ్లషింగ్, పైపుల మరమ్మతులు పూర్తి చేయడం జరిగిందని ఇటీవల ప్రభుత్వం తెలిపింది.  నిరంతర నీటి సరఫరా కొనసాగింపునకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లను  చీఫ్ సెక్రటరీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.  ప్రతి రోజూ గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాపై సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు, నోడల్‌ అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించాలని ఆదేశించారు. 


అయితే కొన్ని చోట్ల తాగునీటి సమస్యలు ఉన్నాయని మీడియాలో వస్తున్నాయి. వాటి ఆధారంగా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.