Harish Rao advises Sajjanar to wear Congress scarf: సి.పి. సజ్జనార్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జర్నలిస్టుల అరెస్టులను సమర్థిస్తూ సజ్జనార్ మాట్లాడటాన్ని తప్పుబడుతూ, ఆయన తీరుపై హరీష్ రావు ఘాటుగా స్పందించారు. పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి, అధికార పార్టీ కార్యకర్తల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సజ్జనార్ గారు.. మీరు పోలీసు అధికారిలా కాకుండా కాంగ్రెస్ ప్రతినిధిలా మాట్లాడుతున్నారు. మీకు అంతగా ఇష్టముంటే ఖాకీ చొక్కా తీసేసి, కాంగ్రెస్ కండువా కప్పుకుని రాజకీయం చేయండి అంటూ ఘాటుగా విమర్శించారు. జర్నలిస్టుల అరెస్టులను వెనకేసుకురావడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన ధ్వజమెత్తారు. గతంలో మంత్రి కొండా సురేఖ, కేటీఆర్ పై , ఒక అగ్ర నటిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. "ఆనాడు కేటీఆర్ గారి మీద, ఆయన కుటుంబం మీద కొండా సురేఖ నోటికొచ్చినట్లు మాట్లాడినప్పుడు మీ చట్టం ఎటు పోయింది సజ్జనార్ గారు? అప్పుడు మహిళా గౌరవం మీకు గుర్తుకు రాలేదా?" అని ప్రశ్నించారు. కేటీఆర్ విషయంలో బాధపడింది కూడా ఆయన భార్య, తల్లి రూపంలో ఉన్న మహిళలే కదా అని ప్రశ్నించారు. అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఇప్పుడు జర్నలిస్టులను ఎందుకు వేధిస్తున్నారని ఆయన నిలదీశారు. జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఎవరైనా తప్పు చేస్తే చట్టప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలని, కానీ దొంగల్లాగా ఇళ్లలోకి చొరబడి భయభ్రాంతులకు గురిచేయడం ఏంటని ప్రశ్నించారు. కేవలం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారనే కక్షతోనే జర్నలిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని, ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మహిళా అధికారుల గౌరవం గురించి మాట్లాడుతున్న సజ్జనార్, ప్రతిపక్ష పార్టీ నేతల కుటుంబాల్లోని మహిళల గౌరవం గురించి ఎందుకు మాట్లాడటం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు అసభ్యంగా మాట్లాడితే ఒక చట్టం, ఇతరులపై మరొక చట్టం ఉంటుందా అని అడిగారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని, పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మగా మారడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సజ్జనార్ ఏమన్నారంటే? బహిరంగ జీవితంలో విమర్శలు, పరిశీలనలు సహజమని, అయితే ఒక మహిళను ఆమె ప్రభుత్వ అధికారిణి అయినా, గృహిణి అయినా మాటలతో లేదా మీడియా కథనాలతో కించపరచడం విమర్శ కాదని, అది క్రూరత్వం అని సజ్జనార్ పేర్కొన్నారు. టీవీ స్టోరీలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా మహిళల ప్రతిష్టను దిగజార్చడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, దీనిని ప్రతి ఒక్కరూ బేషరతుగా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళల క్యారెక్టర్‌పై దాడి చేయడం అంటే మనం విలువ ఇచ్చే సామాజిక పురోగతిపై దాడి చేయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మన ప్రాచీన సంస్కృతిలోని ఎక్కడ మహిళలు గౌరవించబడతారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనే శ్లోకాన్ని ఉటంకిస్తూ సజ్జనార్ హితబోధ చేశారు. ప్రస్తుతం మహిళలు పరిపాలన, పోలీసింగ్, సైన్స్ వంటి రంగాల్లోనే కాకుండా ఇంటి బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందుండి నడిపిస్తున్నారని కొనియాడారు. అటువంటి వారిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దాడులకు దిగడం సమాజ భవిష్యత్తును దెబ్బతీస్తుందని హెచ్చరించారు.