హైదరాబాద్: ప్రజా సంబంధిత, నేరాల గురించి అవగాహన కల్పించే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తాజాగా మరో అంశంపై స్పందించారు. మహిళల వ్యక్తిత్వంపై దాడి చేయడం క్రూరత్వమని, వారి గురించి దుష్ప్రచారం చేయడం నేరమన్నారు. మహిళలపై దుష్ప్రచారం, దాడులు చేయడమంటే వారి పురోగతిని అడ్డుకోవడమేనని అన్నారు.
హైదరాబాద్ సీపీ సజ్జనార్ ట్వీట్ వైరల్..ప్రజా జీవితంలో విమర్శలు సహజమేనని. రాజకీయాలైనా, సామాజిక అంశాలైనా భిన్నాభిప్రాయాలు ఉండటం ప్రజాస్వామ్య లక్షణం అన్నారు సజ్జనార్. కానీ మహిళలపై వ్యక్తిగత దాడులు చేయడం, వారి చరిత్రను కించపరచడం (Character Assassination), అసభ్య వ్యాఖ్యలు చేయడం విమర్శలు అనిపించుకోవు అన్నారు. అలాంటి చర్యలు కేవలం క్రూరత్వం మాత్రమేనని, మహిళా అధికారులపై ఉద్దేశపూర్వక దుష్ప్రచారం చేయడం అత్యంత ఆందోళనకరమైన విషయం అన్నారు. వారిని వ్యక్తిగతంగా దెబ్బతీయడం, ప్రతిష్ఠను నాశనం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సజ్జనార్ పేర్కొన్నారు.
మహిళా శక్తి - అపరిమితమైన గౌరవంఒక మహిళ ప్రభుత్వ ఉద్యోగి అయినా, ప్రైవేట్ ఉద్యోగి అయినా, లేదా గృహిణి అయినా.. ఆమెకు అపరిమితమైన గౌరవం ఇవ్వాలి. నేటి మహిళ అన్ని రంగాల్లో ముందువరుసలో ఉండి నాయకత్వం వహిస్తోంది. పాలనలో, పోలీసు శాఖలో, శాస్త్ర సాంకేతిక రంగంలో, మీడియా రంగం సహా పలు రంగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకవైపు ఇంటి పనులు, మరోవైపు ఉద్యోగం చేయడ.. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఎన్నో కనిపించని బాధ్యతలను భుజాన వేసుకుని మహిళలు కుటుంబాన్ని, సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. ఇలాంటి మహిళలపై దాడులు చేయడం అంటే సమాజ ప్రగతిపై దాడి చేయడమే అన్నారు.
భారతీయ సంస్కృతి, సామాజిక బాధ్యతమన భారత సాంప్రదాయం ఎప్పుడూ ఒకే సందేశాన్ని ఇస్తుందని.. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” (ఎక్కడ మహిళలు పూజింపబడతారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారు) అని సజ్జనార్ తన ట్వీట్లో గుర్తుచేశారు. మహిళలకు గౌరవం ఉన్న చోటే సుభిక్షంగా ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు నేడు టీవీ చర్చలు, సోషల్ మీడియా పోస్టులు, కథనాల పేరుతో మహిళలపై జరుగుతున్న దూషణలు అసహ్యకరంగా మారుతున్నాయని తెలిపారు. మహిళలను గౌరవించని సమాజం తన భవిష్యత్తును కోల్పోతుందని, దేశాన్ని ముందుండి నడిపిస్తున్న మహిళలను కించపరచడం దేశానికే పెద్ద నష్టం అని హెచ్చరించారు.
ఇక సహించబోముమహిళలపై జరుగుతున్న అవమానం, వివక్ష, చరిత్ర హననాన్ని ఇకపై ఎంతమాత్రం సహించబోం అని ఈ సందర్భంగా స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇక సామాజిక మాధ్యమాల్లో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే వారు, మహిళలపై వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేసే వారు చట్టం ముందు దోషులుగా నిలబడాల్సిందే అన్నారు. భవిష్యత్తు మహిళలదే అని, ఆ భవిష్యత్తు పరస్పర గౌరవంతోనే నిర్మితమవుతుంది కానీ, అవమానాలతో కాదు అని సజ్జనార్ సూచించారు.