Harish Rao :   ఉన్న మాటంటే ఉలుకెందుకని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఏపీ మంత్రులపై ఫైర్ అయ్యారు. ఏపీ మంత్రులపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మరోసారి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో ఓ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు.  తెలంగాణలో అన్ని పథకాలు బాగున్నాయన్నారు. ఇదే మాట చెప్పానే తప్ప.. ఏపీ ప్రజల్ని తిట్టలేదన్నారు. కానీ అక్కడి మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కుపై మౌనం ఎందుకని ప్రశ్నించానన్నారు. ఇందులో ఏమైనా తప్పుందా ? అని హరీశ్ రావు ప్రశ్నించారు. మీకు చేతనైతే ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు పై పోరాడండి అని అన్నారు.

ఏపీ ప్రభుత్వ పనితీరుపై  హరీష్ రావు చేసిన  వ్యాఖ్యలను ఖండిస్తూ.. వైఎస్ఆర్‌సీపీ మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రులు హరీష్ రావుపై ఎదురుదాడి చేశారు. మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ రాజకీయ దుమారానికి కారణం అయ్యాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ అంశంలో  స్పందించారు. పాలకులు వేరు.. ప్రజలు వేరు. పాలకులు చేసిన వ్యాఖ్యలతో ప్రజలకు సంబంధం లేదని  వైసీపీ మంత్రులు ప్రజల్ని తిట్టడం సరి కాదని పవన్ అన్నారు.  హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు  ప్రతి స్పందనగా వైసీపీ నాయకులు, మంత్రులు తెలంగాణ ప్రజలను తిట్టడం, తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడటం త‌నకు వ్యక్తిగతంగా మనస్తాపం కలిగించిందని పవన్ స్పష్టం చేశారు. 

దయచేసి వైసీపీ నాయకుల లకు నా విన్నపం… నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండన్నారు. సదరు తెలంగాణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కించపరిచేలా ఉన్నాయి అనుకుంటే ఆయన్నే విమర్శించండన్నారు. అంతేకానీ తెలంగాణ ప్రజలను వివాదాల్లోకి లాగవద్దన్నారు. ముఖ్యంగా వైసీపీ సీనియర్ నాయకులు దీనిపై స్పందించాలన్నారు. మీకు తెలంగాణలో ఇళ్లు, వ్యాపారాలు ఉన్నాయి. బొత్స లాంటి వాళ్లు ఇక్కడ వ్యాపారాలు చేసిన వాళ్లే కదా ? బొత్స కుటుంబానికి ఇక్కడ కేబుల్ వ్యాపారం ఉండేదన్నారు. దయచేసి మంత్రివర్గంలో ఎవరైనా అదుపు తప్పి మాట్లాడితే తోటి మంత్రులతోపాటు ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలను ఖండించాలన్నారు. తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరముంద‌ని జనసేనాని స్సష్టం చేశారు.

పవన్‌ వ్యాఖ్యలను పేర్ని నాని ఖండించారు.   హరీష్ ఏమన్నాడో తెలుసుకోకుండా.. పవన్ ఏపీ మంత్రులను తప్పుబట్టడం సరికాదని అన్నారు. పవన్ కల్యాణ్ కు బీఆర్‌‌ఎస్ పై, తెలంగాణ పై ఎందుకంత ప్రేమ వచ్చిందో తనకు అర్థం అవ్వట్లేదని అన్న పేర్ని నాని.. తెలంగాణ మంత్రుల్ని విమర్శిస్తుంటే పవన్‌కు వచ్చిన బాధ ఏంటో చెప్పాలన్నారు. పవన్ తెలంగాణ మంత్రులపై ఈగ వాలనివ్వడం లేదు. గతంలో తెలంగాణ మంత్రులపై పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను పేర్ని నాని మీడియా ముందు ప్రదర్శించారు.  సొంత రాష్ట్రంపై ప్రేమ లేని పవన్ కల్యాణ్.. ఏపీ మంత్రులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ ఏపీని అవమానిస్తూ మాట్లాడుతుంటే చూస్తూ ఉండాలా అని ప్రశ్రించారు.