రోజు రోజుకు ఆన్ లైన మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇండియన్ రైల్వే టికెటింగ్ పోర్టల్ IRCTC ఎప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం కీలక సూచనలు, సలహాలు ఇస్తూనే ఉంది. తాజాగా తన యూజర్లకు ఓ ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ ప్లాట్ ఫారమ్‌ల ద్వారా హానికరమైన యాప్ వ్యాప్తి చెందుతుందని IRCTC తెలిపింది. irctcconnect.apk అనే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేస్తే, అది మీ స్మార్ట్ ఫోన్ లోని వివరాలను పూర్తిగా తస్కరించే అవకాశం ఉందని వెల్లడించింది.
అనుమానాస్పద యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి!
UPI వివరాలు, బ్యాంకింగ్ సమాచారం సహా ఆయా వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని కొంత మంది సైబర్ నేరగాళ్లు ఈ యాప్స్ ద్వారా చేజిక్కించుకుంటున్నట్లు వెల్లడించింది. మోసగాళ్లు బాగా ప్రచారంలోకి తెస్తున్న ఈ హానికరమైన యాప్‌ని ఉపయోగించకూడదని IRCTC తెలిపింది. వినియోగదారులు అనుమానాస్పద యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లో అలాంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేయకూడదని హెచ్చరించింది. .
IRCTC జారీ చేసిన హెచ్చరిక ఇదే!
“ఫిషింగ్ వెబ్‌సైట్ (https://irctc.creditmobile.site)లో హోస్ట్ చేయబడిన హానికరమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్ (irctcconnect.apk) ఇన్ స్టంట్ మెసేజింగ్ ప్లాట్ ఫారమ్‌ల ద్వారా సర్క్యులేట్ అవుతోంది. WhatsApp, టెలిగ్రామ్, మొదలైనవాటిలో బాగా తిరిగుతోంది. ఈ Android యాప్ (APK ఫైల్) హానికరమైనది. మొబైల్ ను పూర్తి స్థాయిలో ప్రభావితం చేస్తుంది. సైబర్ మోసగాళ్లు భారీ స్థాయిలో ఫిషింగ్ లింక్‌లను పంపుతున్నారు. ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని వినియోగదారులకు సూచిస్తున్నారు. UPI వివరాలు, క్రెడిట్/డెబిట్ కార్డ్ సమాచారాన్ని IRCTC అధికారుల మాదిరిగా అడుగుతూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దయచేసి ఈ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయవద్దని కోరుతున్నాం. మోసగాళ్ల నుంచి సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నాం. Google Play Store లేదా Apple Store నుంచి IRCTCకి సంబంధించిన అధికారిక ‘IRCTC రైల్ కనెక్ట్’ మొబైల్ యాప్‌ని మాత్రమే డౌన్ లోడ్ చేసుకోండి. IRCTC తన వినియోగదారులకు సంబంధించిన పిన్, OTP, పాస్‌వర్డ్, క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలు, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్, UPI వివరాల కోసం ఎలాంటి కాల్ చేయదని గుర్తుంచుకోండి” అంటూ IRCTC
అధికారిక వెబ్ సైట్ మాత్రమే చూడండి!
రైల్వే ప్రయాణీకులు ఆన్‌లైన్ రైల్వే టిక్కెట్లు, క్యాటరింగ్ సేవల పొందడానికి కేవలం భారతీయ రైల్వే వెబ్‌సైట్ IRCTC మాత్రమే అనుసరించాలని సూచించింది. అంతేకాదు, వినియోగదారులు తమ ఖాతా నంబర్, ATM కార్డ్ వివరాలు, PIN, OTPని ఫోన్, ఇమెయిల్ ద్వారా ఎవరికీ వెల్లడించవద్దని తెలిపింది. క్యాన్సిల్ చేసిన టిక్కెట్ల డబ్బును రిటర్న్ తీసుకోడానికి వ్యక్తిగత సమాచారం కోసం IRCTC అధికారులు వినియోగదారులకు ఎప్పటికీ కాల్ చేయరని గుర్తుంచుకోవాలని సూచించింది.
Read Also: అదిరిపోయే ఫీచర్లు, అంతకు మించిన స్పెసిఫికేషన్లతో వస్తున్నXiaomi 13 Ultra - లాంచ్ ఎప్పుడంటే..