ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావుపై గొత్తికోయలు దాడి చేసి హత్య చేయడం సంచనలంగా మారింది. శ్రీనివాసరావు అంత్యక్రియలకు హాజరైన మంత్రి పువ్వాడ, ఇంద్రకరణ్ రెడ్డిల వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నినాదాలు చేశారు. అయితే తాజాగా గుత్తికోయల వ్యవహారంపై సంచలన కామెంట్స్‌ చేశారు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌. తెలంగాణలో గుత్తికోయలకు ఎలాంటి హక్కులూ లేవని తేల్చి చెప్పారు మంత్రి సత్యవతీ రాథోడ్‌. గుత్తికోయలు ఈ రాష్ట్ర గిరిజనులు కాదనీ, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు వారు అర్హులు కాదనీ వ్యాఖ్యానించారు మంత్రి సత్యవతీ రాథోడ్‌. 


ఈ వ్యవహారంపై కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. పోడు భూముల కోసం గుత్తికోయలు చేస్తున్న పోరాటంపై స్పందించారు. వారి పోరాటంపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. గుత్తి కోయలు ఈ రాష్ట్రానికి చెందిన వారే కాదని తేల్చి చెప్పారు. ఈ రాష్ట్ర గిరిజనులే కాని గుత్తికోయలకు పోడు భూముల పట్టాలు వర్తించవని, ఏ రిజర్వేషన్లూ అప్లై కావని స్పష్టం చేశారు. ఫారెస్టు అధికారులపై జరుగుతోన్న దాడులను మంత్రి తీవ్రంగా ఖండించారు. మృతి చెందిన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మంత్రి. ఇక ఫారెస్ట్‌ రేంజర్‌ శ్రీనివాస్‌ హత్యతో.. అటవీశాఖ అప్రమత్తమైంది. ఆపరేషన్‌ వెపన్స్‌ షురూ చేశారు ములుగు జిల్లా అటవీశాఖ అధికారులు. 


గుత్తికోయలు ఉండే ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా భారీ సంఖ్యలో మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాల్లో విల్లంబులు, బల్లెంలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. గుత్తికోయల దగ్గర ఆయుధాలు లేకుండా దాడులకు ఆస్కారం ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోదాలు నిర్వహించారు అధికారులు. ఇక తమకు కూడా ఆయుధాలు ఇవ్వాలని పట్టుబడుతున్నారు అటవీశాఖ అధికారులు. ఇక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావు హత్య చేసిన నిందితులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.


భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలోని దట్టమైన అడవిలో ఉంటుందీ ఎర్రబోడు. గూగుల్ మ్యాప్‌లో వెతికినా ఈ గ్రామం ఆచూకీ దొరకదు. కానీ ఇక్కడ 30 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గట్టిగా మాట్లాడితే వంద మందికి ఈ ఎర్రబోడు ఆవాసం. వీళ్లంతా 25 సంవత్సరాల క్రితం చత్తీస్ ఘడ్ నుంచి వలస వచ్చిన వాళ్లే. పోడు సాగు చేసుకొని జీవనం సాగు చేస్తున్నారు. అన్ని ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా పోడు సమస్య కొనసాగుతూనే ఉంది. అటవీ భూములను నరికి వ్యవసాయం చేయడం.. ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు జరిగిన ఘటన మాత్రం దారుణాతి దారుణం. 


ఎర్రబోడులో ప్లాంటేషన్ మొక్కలను గొత్తి కోయలు నరుకుతుండగా అడ్డుకునేందుకు వెళ్ళిన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ పై.. గుత్తి కోయలు దాడి చేశారు. తమకు భూములు దక్కకుండా చేస్తున్నారన్న ఆవేశంతో.. కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తీవ్రగాయాలపాలైన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్‌రావును ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారాయన. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం ఈర్లపూడి ఆయన స్వగ్రామం. శ్రీనివాస్ మరణంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే నిజానికి పోడు భూముల వివాదాలు దశాబ్దాలుగా నడుస్తున్నాయి. పోడు రైతులు, అటవీ అధికారుల మధ్య ఎప్పటినుంచో వివాదాలు, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇలాంటి దారుణం ఎక్కడా జరగలేదు. ఏకంగా ఫారెస్ట్ అధికారినే కత్తులతో నరికి చంపిన ఘటనలు మాత్రం ఎక్కడా లేవు. కానీ ఫస్ట్ టైమ్ ఇలా జరగడంతో రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.