RS Praveen Kumar : జూన్ 9వ తేదీన జరుగబోవు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష(Group-1 prelims) వాయిదా వేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) డిమాండ్ చేశారు. జూన్ 9వ తారీఖున పరీక్ష నిర్వహించొద్దని.. అదే రోజున ఇంటెలిజెన్స్ బ్యూరో పరీక్ష(Intelligence Bureau) కూడా ఉందన్నారు. చాలా మంది నిరుద్యోగులు ఇంటెలిజెన్స్ బ్యూరో పరీక్ష రాస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల వల్ల పలువురు ప్రభుత్వ ఉద్యోగులు గ్రూప్-1కు ప్రిపేర్ కాలేదని చెప్పారు. వారి కోసం నెల రోజుల సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో వారు బాగా ప్రిపేర్ అవుతారని తెలిపారు.
రేపటి నుంచే హాల్ టిక్కెట్లు
కాగా, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9వ తేదీ నే నిర్వహించేందుకు టీజీపీఎస్సీ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసింది. జూన్ 1వ తేదీ తేదీ మధ్యాహ్నం నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనుంది. ఆ రోజు నుంచి అభ్యర్థులు హాట్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ(TGPSC) ప్రకటించింది. జూన్ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్ష జరుగనుంది.
సర్వం సిద్ధం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న మొత్తం 563 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది టీజీపీఎస్సీ. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. టీజీపీఎస్సీ జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహిస్తుంది. జూన్ ఒకటి నుంచి టీజీసీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షలను నిర్వహించనుంది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష విధానం
మొత్తం 150 మార్కులకు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు (150 నిమిషాలు).
పరీక్ష కేంద్రాలు
ఆసిఫాబాద్-కొమ్రంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల-రాజన్న, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి-యాదాద్రి, జనగాం, మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ-గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు
అభ్యర్థులకు సంబంధించిన సమాచారాన్ని ముద్రించిన ఓఎంఆర్ షీట్లు ఇస్తారు. అభ్యర్థులు ఓంఎఆర్, ప్రశ్నపత్రంలో పొందుపరిచిన సూచనలు పాటించాలి. అభ్యర్థుల సౌకర్యార్థం నమూనా ఓఎంఆర్ ను కమిషన్ అధికారిక వెబ్ సైట్లో ఉంచారు. ఈ కాపీని డౌన్ లోడ్ చేసుకుని అందులోని సూచనల ప్రకారం బబ్లింగ్ చేయడాన్ని ప్రాక్టీస్ చేయాలి. అభ్యర్థులు పరీక్ష పూర్తయ్యే వరకు పరీక్ష కేంద్రాన్ని విడిచి వెళ్లకూడదు. పరీక్ష పూర్తయ్యాక ఓఎంఆర్ పత్రాన్ని ఇన్విజిలేటర్ కు అప్పజెప్పాలి. ఎగ్జామ్ కు హాజరయ్యే అభ్యర్థులు చెప్పులు మాత్రమే వాడాలి. బూట్లు వేసుకుని ఎగ్జామ్ హాల్ కు రాకూడదు. అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు పరీక్ష కేంద్రంలో ఉదయం 9.30 నుంచి ప్రారంభిస్తారు.