Governor Tamilisai: మెడికో విద్యార్థి ప్రీతి ఆరోగ్యం సరిగ్గా లేదని మొదట తప్పుడు సమాచారం ఇచ్చి నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నించిన కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అధికారులపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ వీసీకి లేఖ రాశారు. సమగ్ర విచారణ జరిపి నిందితులను కటినంగా శిక్షించాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీల్లో యాంటీ రాగింగ్ చర్యలు గట్టిగా తీసుకోవాలని గవర్నర్ సూచించారు. మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని వివరించారు. ఇలాంటి సంఘటనలలో ఎలాంటి ఉదాసీనత లేకుండా, తక్షణమే స్పందించి కాలేజీల్లో కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే మెడికల్ కళాశాలల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వివరించారు.
పీజీ మెడికోల డ్యూటీ సమయాలు, వారికి సంబందించి సరైన విశ్రాంతి లాంటి అంశాలపై సరైన శ్రద్ధ పెట్టాలని తెలిపారు. కౌన్సెలింగ్ సెంటర్లు కూడా మహిళా మెడికోలకు ఏర్పాటు చేయాలని గవర్నర్ తమిళిసై పీసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాగే ప్రీతి మరణానికి కారణం అయిన నిందితులు ఎంతటివారైనా వారిని వదిలిపెట్టకూడదని కేటీఆర్ తేల్చి చెప్పారు.
ప్రీతి తల్లిదండ్రులకు ఎమ్మెల్సీ కవిత లేఖ
వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి తల్లిదండ్రులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. తన సోదరి డాక్టర్ ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. ఈ విషయం తెలియగానే ఒక తల్లిగా నేను ఎంతో వేదనకు గురయ్యానని కవిత లేఖలో తెలిపారు. ప్రీతి కోలుకోవాలని మూడు రోజులుగా కోరుకున్న కోట్లాది మందిలో నేనూ ఒకరిని అని లేఖలో పేర్కొన్నారు. ఎన్నో కష్టాలు భరించి పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేక పోతుమని అన్నారు. చదువుకుని సమాజానికి సేవ చేయాలన్న తపన, పట్టుదల ఉన్న ప్రీతికి ఇలా జరగడం దురదృష్ట కరం అన్నారు. ఒక ఉత్తమ వైద్యురాలిని సమాజం కోల్పోయిందని లేఖలో రాశారు. అందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నానని కవిత తెలిపారు. కన్న బిడ్డ మరణంతో కడుపు కోత అనుభవిస్తున్న మీకు ఎంత ఓదార్పు ఇవ్వాలని ప్రయత్నం చేసినా అది చాలా తక్కువే అవుతుందని అన్నారు. ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడని పరిస్థితి ఇదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం అండగా ఉంటుంది - కవిత
"మీ కుటుంబానికి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నేతలు అండగా ఉంటారు. మీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రీతి మరణానికి కారణమైన దోషులను రాష్ట్ర ప్రభుత్వం వదిలి పెట్టబోదు అని మీకు హామీ ఇస్తున్నాను. ఇలాంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. యావత్తు రాష్ట్ర ప్రజలు మీ వెంట ఉన్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో భగవంతుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను" అని లేఖలో పేర్కొన్నారు కవిత.