Governor Tamilisai Comments on KCR: తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఇటీవల హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం సందర్భంగా వారిద్దరు సఖ్యంగానే కనిపించారు. దాంతో వారి మధ్య కోల్డ్ వార్ తగ్గి ఉంటుందని అంతా భావించారు. కానీ, తాజాగా తమిళిసై ఢిల్లీలో కేసీఆర్ పైన కాస్త విమర్శనాత్మకంగా వ్యాఖ్యలు చేయడం మరోసారి చర్చనీయాంశం అయింది.


ఢిల్లీలో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో వచ్చిన వరదలపై రాజకీయాలు చేయడం మంచిది కాదని అన్నారు. ఆ నష్టానికి తగ్గట్లుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెలంగాణకు ఇప్పటికే వచ్చాయని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆ నిధులకు సంబంధించిన వివరాలు కూడా ఇచ్చినట్లు గుర్తు చేశారు. తాను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటానని, ఆ బాధ్యతతోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించానని చెప్పారు. ఈ క్రమంలోనే వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చినట్లు చెప్పారు. వరదలకు క్లౌడ్‌బస్టర్ కారణం అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తాను బరెస్ట్ కానని అన్నారు.


ముందస్తుకు వెళ్లే అవకాశం లేదు - గవర్నర్
సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని గవర్నర్ అన్నారు. ఇటీవల రాజ్‌భవన్‌లో సీఎం కేసీఆర్‌ తో కలిసిన తర్వాత కూడా తనకు ప్రొటోకాల్‌లో ఎలాంటి మార్పులేదని వివరించారు. వరదల సమయంలో భద్రాచలంలో పర్యటిస్తున్నప్పుడు అక్కడి కలెక్టర్‌ కూడా రాలేదని చెప్పారు. గవర్నర్‌ను కాబట్టి రాజ్‌ భవన్‌కే పరిమితం కానని, ప్రజలకు అందుబాటులో ఉండటమే తన లక్ష్యమని అన్నారు. ప్రగతి భవన్, రాజ్‌భవన్ గ్యాప్‌పై విలేకరులు ప్రశ్నించగా, తానిప్పుడేమీ దాని గురించి మాట్లాడబోనని అన్నారు.


రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి మాట్లాడుతూ.. నివేదించాను. కింది స్థాయి నుంచి వచ్చిన మహిళ.. దేశానికి రాష్ట్రపతి కావడం కేవలం భారత్‌లోనే సాధ్యమైంది. మహిళా రాష్ట్రపతి కింద మహిళా గవర్నర్‌గా పని చేయడం సంతోషంగా ఉందన్నారు.