Government transfers Metro Rail MD NVS Reddy: తెలంగాణ  ప్రభుత్వం మెట్రోరైల్ ఎండీగా ఉన్న ఎన్వీఎస్ రెడ్డిని బదిలీ చేసింది. ఆయన స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్ ను నియమించింది. ఎన్వీఎస్ రెడ్డి ఇప్పటికే రిటైర్ అయినందున ఆయనను సలహాదారుగా నియమించారు. అలాగే హెచ్‌ఎండీఏ సెక్రటరీగా కోట శ్రీవత్స, మహిళాశ శిశు సంక్షేమ డైరక్టర్ గా శృతి ఓజాను బదిలీ చేశారు. 

Continues below advertisement


హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్  మేనేజింగ్ డైరెక్టర్ గా నల్లమోతు  వేణు గోపాల్ రెడ్డి  2007 నుంచి  కొనసాగుతున్నారు. ఆ పదవిని ఏర్పాటు చేసినప్పటి నుండి ఆయనే ఉన్నారు. నిర్వహిస్తున్నారు. 1983 బ్యాచ్ సివిల్ సర్వీసెస్ అధికారి అయిన ఆయన, మొత్తం 18 సంవత్సరాలకు పైగా ఈ పదవిలో ఉన్నారు . ఎన్వీఎస్ రిటైర్ అయి కూడా 9ఏళ్లు అవుతోంది. 2016లో రిటైర్మెంట్ తర్వాత మళ్లీ 2017లో రీఅపాయింట్‌మెంట్ అయ్యారు. 2025 మార్చిలో ఆయన పదవి రద్దు చేయాలని ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసినప్పటికీ, ఏప్రిల్ 9న మళ్లీ ఒక సంవత్సరం పొడిగించారు. చివరికి ఇప్పుడు సలహాదారుగా పదవి ఇచ్చి బదిలీ చేసారు. 


2007లో ఎచ్‌ఎమ్‌ఆర్‌ఎల్ ఏర్పాటు తర్వాత మొదటి ఎండీగా నియమితులయ్యారు. 69 కి.మీ. ఫేజ్-1 ప్రాజెక్ట్‌ను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మోడల్‌లో పూర్తి చేశారు. 2017 మార్చిలో మెట్రో సర్వీస్ ప్రారంభం నుంచి ఆయన నాయకత్వంలో 57 స్టేషన్లు, 3 కారిడార్లు (బ్లూ, రెడ్, గ్రీన్ లైన్‌లు) ఆపరేషన్‌లోకి వచ్చాయి. ప్రస్తుతం ఫేజ్-2 (లైన్ 4: జూబ్లీహిల్స్ నుంచి రంగారెడ్డి)  ఓల్డ్ సిటీ విస్తరణలు (చార్మినార్, ఫలాక్‌నుమా) ఆయన పర్యవేక్షణలో జరుగుతున్నాయి. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హ్యామ్‌ఎల్) ఎండీగా కూడా పనిచేశారు. 


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  మార్చి 27-28, 2025న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏయూడీ) డిపార్ట్‌మెంట్ ఆర్డర్ జారీ చేసి, 177 మంది రిటైర్డ్ అధికారుల పదవులు మార్చి 31, 2025తో రద్దు చేసింది. ఎన్‌వీఎస్ రెడ్డి కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇది రాజకీయ చర్చకు దారితీసింది, ఎందుకంటే ఆయన టెర్మ్ జూన్ 2025 వరకు ఉండాలని ముందు నిర్ణయించారు.  మార్చి ఆర్డర్ తర్వాత కేవలం 10 రోజుల్లోనే, ఏప్రిల్ 9, 2025న తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆర్డర్ జారీ చేసి, ఆయన పదవిని ఏప్రిల్ 1, 2025 నుంచి మరో సంవత్సరం పొడిగించింది. ఇది ఫేజ్-2 ప్రాజెక్టులు, ఎయిర్‌పోర్ట్ మెట్రో విస్తరణల కోసం తీసుకున్న నిర్ణయంగా ప్రభుత్వం చెప్పింది. 


ఇటీవల ఎల్ అండ్ టీ .. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ లేఖ రాసింది. తాము మెట్రోను నిర్వహించలేకపోతున్నామని.. నిర్వహణ పరంగా లాభాలు రావడం లేదని.. పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయని చెప్పింది. నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయాలని కోరింది. గతంలో కూడా ఎల్ అండ్ టీ తాము తమ వాటాని అమ్మేస్తామని కూడా లేఖలు రాసింది.  ఈ వివాదంతో పాటు.. మెట్రో విస్తరణ విషయంలో సర్వీసులో ఉండే అధికారిని నియమించాలనుకున్న ప్రభుత్వం ఎన్వీఎస్ రెడ్డిని సలహాదారుగా నియమించి.. సర్ఫరాజ్ అహ్మద్ ను ఆయన స్థానంలో నియమించింది.