Government finalizes MPTC and ZPTC seats for Telangana local elections: తెలంగాణ ప్రభుత్వం జిల్లా పరిషత్ స్థానాలు మండల పరిషత్ స్థానాలను ఖరారు చేసి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ZPTC స్థానాలు మొక్కం 566 ఉన్నాయి. MPTC స్థానాలు 5,773గా ఖరారు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ZPTC మరియు MPTC స్థానాల సంఖ్యను ఫైనల్ చేసింది.
71 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో విలీనం కావడంతో MPTC స్థానాల సంఖ్య 5,817 నుండి 5,773కు తగ్గింది. ఈ మార్పు ఇటీవల ఇంద్రేశం, జిన్నారం వంటి కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు కారణంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ అందించాలని నిర్ణయించారు. ఈ రిజర్వేషన్ సర్పంచ్, MPTC, MPP, ZPTC, మరియు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్థానాలకు వర్తిస్తుంది. బీసీ రిజర్వేషన్లను పెంచడానికి ఆర్డినెన్స్ జారీ చేయడం కోసం గవర్నర్ కు పంపారు. గవర్నర్ సంతకం కాగానే ఈ స్థానాలకు రిజర్వేషన్ ఖరారుచేస్తారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం పంచాయతీ రాజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు ఎన్నికల ప్రక్రియను అధికారులు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. చివరి సారిగా 2019లో ZPTC , MPTC ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. 2019 ఎన్నికలలో, మొత్తం 538 ZPTCs , 5,817 MPTCs కోసం ఎన్నికలు నిర్వహించారు. ఈ సారి మున్సిపాలిటీలు పెరిగినందున కౌన్సిలర్ సీట్లు పెరుగుతాయి.
భారత రాజ్యాంగంలో 73, 74వ సవరణల ద్వారా పంచాయతీ రాజ్ ఎన్నికలు జరుగుతాయి. ఈ వ్యవస్థ గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో పాలకవర్గాలను కలిగి ఉంటుంది. జిల్లా పరిషత్. మండల పరిషత్, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రజా ప్రతినిధులు ఉంటారు. ప్రతి మండలం ఒక ZPTC నియోజకవర్గంగా పరిగణిస్తారు. ZPTC సభ్యుడు ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నికవుతారు. జిల్లా పరిషత్‌లలో మైనారిటీల నుండి ఇద్దరు వ్యక్తులు ZPTCలలో కో-ఆప్టెడ్ సభ్యులుగా నియమించవచ్చు. MPTC సభ్యులు కూడా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నికవుతారు. వీరు మండల స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.
2019లో జరిగిన ZPTC మరియు MPTC ఎన్నికలలో, తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) 534 ZPTC స్థానాలలో 446 , 5,800 MPTC స్థానాలలో 3,556 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 76 ZPTCలు, 1,377 MPTC స్థానాలను గెలిచింది. బీజేపీ 8 ZPTC, 211 MPTC స్థానాలును గెలిచింది.