Karnataka government And Nara Lokesh:   కర్ణాటక ప్రభుత్వం ఎయిర్ పోర్టు వద్ద ఎరో స్పేస్ పార్క్ నిర్మాణం కోసం పదిహేడు వందల ఎకరాల్ని సేకరించాలనుకుని భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఈ భూములు ఉన్న దేవనహళ్లి గ్రామంలో  రైతులు తిరగబడ్డారు. దాంతో ప్రభుత్వం భూసేకరణను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. ఏరోస్పేస్ పార్క్ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు.   వెంటనే నారా లోకేష్ స్పందించారు. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంతో  ఏరోస్పేస్ ఇండస్ట్రీ కోసం తన వద్ద మంచి ఆలోచన ఉందన్నారు.   మీ కోసం మా వద్ద ఆకర్షణీయమైన ఏరోస్పేస్ పాలసీ ఉంది, అత్యుత్తమ ప్రోత్సాహకాలు  అలాగే 8000 ఎకరాలకు పైగా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న భూమి ఉందన్నారు. అది కూడా బెంగళూరుకు సమీపంలోనే ఉందన్నారు. త్వరలోనే కలుద్దామని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.  

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం..  అనంతపురం సరిహద్దులకు దగ్గరగా ఉంటుంది. అందుకే నారా లోకేష్ పిలుపునకు ఏరో స్పేస్ ఇండస్ట్రీ కి చెందిన వారు స్పందిస్తే.. అనంతపురంకు అడ్వాంటేజ్ అవుతుంది. నారా లోకేష్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ట్వీట్‌కు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య స్పందించారు. లోకేష్ ను చూసి నేర్చుకోవాలని కర్ణాటక ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. తర్వాత ట్వీట్ తొలగించారు.  కానీ చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరును విమర్శించారు. 

చివరికి పరిశ్రమలు ఏపీకి తరలిపోతాయన్న ఆందోళన వ్యక్ంత కావడంతో కర్ణాటక ఇండస్ట్రీస్ మంత్రి సోషల్ మీడియాలో స్పందించారు. కర్ణాటక కేవలం భూమిని మాత్రమే అందించదు - ఇది భారతదేశంలో నంబర్ 1 ఏరోస్పేస్ & డిఫెన్స్ ఎకోసిస్టమ్‌ను అందిస్తుందని చెప్పుకొచ్చారు.  భారతదేశ ఏరోస్పేస్ ఉత్పత్తిలో 65% తోడ్పడి జాతీయంగా నంబర్ 1, ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉన్నామన్నారు.  ఏమి చేయాలో, ఎప్పుడు చేయాలో మరియు ఎలా చేయాలో మాకు తెలుసు. ఏరో స్పేస్ పార్క్ ఎక్కడికీ వెళ్లదన్నారు.