Maoist Latest News: మావోయిస్టులను నిర్మూలిస్తోన్న పోలీసు బలగాల్లో గోప్నీ సైనిక్ గేమ్ ఛేంజర్స్. వీరు లేకుండా ఇటీవలి కాలంలో ఒక్క ఎన్ కౌంటర్ జరగలేదనే చెప్పాలి. వారే గోప్నీ సైనిక్. వీరినే సీక్రెట్ ఆపరేటర్స్ అని కూడా పిలుస్తారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌లోని డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్‌లో అంతర్భాంగా పని చేస్తారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో వీరు తమ ప్రాణాలు ఫణంగా పెట్టి  గూఢాచార్యం చేస్తూ వారి ఆచూకి కనిపెడతారు. వారు లొంగిపోయేలా చేయడమో లేక ఎన్ కౌంటర్లలో అంతమొందించడమే వీరి లక్ష్యం.

గోప్నీ సైనిక్ అంటే ఏంటి?

"గోప్నీ" అనే పదం హిందీ భాషకు సంబంధించిన పదం. గోప్నీ అంటే "రహస్యమైన" లేదా "గుప్తమైన" అనే అర్థాన్నిస్తుంది. గోప్నీ సైనిక్ అంటే రహస్యంగా పని చేసే సైనికులు లేదా సీక్రెట్ ఆపరేటర్స్ అని అర్థం. ఈ గోప్నీ సైనిక్ దళంలో లొంగిపోయిన మాజీ మావోయిస్టులే అధికంగా సభ్యులుగా ఉంటారు. వీరంతా  నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలతో కలిసిపోయి మావోయిస్టులకు సంబంధించిన రహస్య సమాచారాన్ని అత్యంత చాకచక్యంతో సేకరిస్తారు. ఇందులోలొంగిపోయిన మాజీ మావోయిస్టులతోపాటు స్థానిక గిరిజన యువకులను కూడా గోప్నీ సైనిక్ దళంలో చేర్చుకుంటారు. వీరికి మావోయిస్టుల కదలికలు, వారి నెట్ వర్క్ పే అవగాహనతోపాటు, స్థానిక గిరిజన భాష, సంస్కృతులపై అవగాహన  ఉంటుంది. అంతే కాకుండా మాజీ మావోయిస్టులు, స్థానిక గిరిజనులు ఇందులో భాగస్వామ్యులు కావడం వల్ల అటవీ ప్రాంతంపైన పట్టు, నక్సల్స్ గెరిల్లా వ్యూహాలపైన అవగాహన ఉంటుంది. అలాంటి వారినే ప్రత్యేకంగా ఎంపిక చేసి ఈ దళంలో చేర్చుకుంటారు.

ఏయే ప్రాంతాల్లో ఎప్పుడు గోప్నీ సైనిక్ దళం ఏర్పడిందంటే ?

మావోయిస్టును బలంగా ఎదుర్కొనేందుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీఆర్జీ (District Reserve Guard)లోనే ఈ గోప్నీ సైనిక్ భాగంగా ఏర్పాటు చేసింది. ఇది చాలా గోప్యంగా పని చేస్తుంది. ఈ డీఆర్జీ యూనిట్లను‌ ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం 2008లో ప్రారంభించింది. అప్పటి నుంచే ప్రభుత్వం ఈ  గోప్నీ సైనిక్ దళం ఏర్పాటుకు వ్యూహ రచన చేసింది. లొంగిపోయిన మావోయిస్టులకు ఉన్న అటవీ పరిజ్ఞానం, మావోయిస్టులు ఆలోచించే విధానం, వారి గెరిల్లా యుద్ధ నైపుణ్యాన్ని, వారి పాత నెట్ వర్క్ ను ఉపయోగించుకునే ఆలోచనతో ఈ ప్రత్యేక దళాన్ని రూపొందించారు. ఇది ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర పోలీసు విభాగంలో వ్యూహాత్మక దళంగా గోప్ని సైనిక్ దళాన్ని చెప్పుకోవాలి. క్షేత్రస్థాయిలో జిల్లా ఎస్పీ నాయకత్వంలో డీఆర్జీలో అంతర్భాగంగా ఈ సైనిక్ దళం పని చేస్తుంది.

గోప్నీ సైనిక్ దళాన్ని దశల వారీగా ఎలా ఏర్పాటు చేశారంటే?

డీఆర్జీ యూనిట్లను ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం  ఆయా జిల్లాల్లో దశలవారీగా  ప్రారంభించారు. ఆ తర్వాత ఆ యూనిట్లలో గోప్నీ సైనిక్ దళాలను అంతర్భాగం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

  • 2008: డీఆర్జీ యూనిట్లు మొదట కాంకేర్ (Kanker) నారాయణపూర్ (Narayanpur) జిల్లాల్లో ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ప్రారంభించారు..
  • 2013: బిజాపూర్ (Bijapur) బస్తర్ (Bastar) జిల్లాల్లో విస్తరించడం జరిగింది
  • 2014: సుక్మా (Sukma) కొండగావ్ (Kondagaon) జిల్లాల్లకు వ్యాపింపజేశారు
  • 2015: దంతెవాడ (Dantewada) జిల్లాలో కూడా ఈ దళాలను ప్రారంభించారు. 

ఆ తర్వాత రాజ్‌నంద్‌గావ్ (Rajnandgaon), కాంకేర్ (Kanker), సుక్మా (Sukma), బీజాపూర్ (Bijapur), బస్తర్ (Bastar), దంతెవాడ (Dantewada), నారాయణపూర్ (Narayanpur), కొండగావ్ (Kondagaon), బలోద్ (Balod), కబీర్‌ధమ్ (Kabirdham), ముంగేలి (Mungeli), బలరాంపూర్ (Balrampur) వంటి మావోయిస్టు ప్రభావిత జిల్లాలన్నింటికీ డీఆర్జీ యూనిట్లు విస్తరించబడ్డాయి. ఈ జిల్లాల్లోనే గోప్నీ సైనిక్‌లు కూడా డీఆర్జీలో అంతర్భాగంగా పనిచేస్తున్నారు.

 ప్రమాదకరమైన విధుల్లో గోప్నీ సైనిక దళం

డీఆర్జీలో భాగమైన మాజీ మావోయిస్టులు, స్థానిక గిరిజన యువత ఉన్న గోప్నీ సైనిక దళం చాలా ప్రమాదకరమైన విధులను నిర్వర్తిస్తోంది. ఈ క్రింది విధులను గోప్నీ సైనిక్ దళం చేపడుతోంది.

  • గూఢచార సమాచార సేకరణ- మావోయిస్టు పార్టీలో అగ్రనేతల కదలికలు, కింది స్థాయి నేతలతో జరిపే సమావేశాలు, అటవీ ప్రాంతంలోను, మైదాన ప్రాంతంలోను నక్సల్స్ స్థావరాలు, ఆయుధ నిల్వలు ఎక్కడ ఉన్నాయి. పార్టీ నిర్వహణ కోసం ఎవరి నుంచి నిధుల సేకరణ జరుగుతోంది వంటి అంశాలను వీరు రహస్యంగా సేకరిస్తారు. నక్సల్స్ భవిష్యత్తు ప్రణాళికలను, వారు చేపట్టే దాడుల వంటి వివరాలను సీక్రెట్ గా తెలుసుకుంటారు. 

 

  • కూంబింగ్, ఎన్కౌంటర్లలో భాగస్వామ్యం - మావోయిస్టుల ఆచూకీ తెలిస్తే డీఆర్జీ దళంతోపాటు వీరు కూంబింగ్ లో పాల్గొంటారు. ప్రత్యక్ష ఎన్ కౌంటర్లలో కూడా గోప్నీ సైనికులు  భాగస్వామ్యులవుతారు. ఆ సమయంలో పోలీసు భద్రతా బలగాలకు అడవిలో దారి చూపడం, మావోయిస్టులు అటవీ ప్రాంతంలో ఎక్కడ షెల్టర్ తీసుకునే అవకాశాలు ఉంటాయన్న అంశాలను గుర్తించి బలగాలకు దిశానిర్దేశం చేయడం వీరి పని.  మావోయిస్టుల రహస్య మార్గాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించడం కూడా గోప్నీ సైనిక్ ల విధుల్లో ఒకటి. ఇలా అటవీ ప్రాంతంలో గెరిల్లా యుద్ధతంత్రం పాటించే మావోయిస్టు బలగాలపై పోలీసు బలగాలు పై చేయి సాధించడానికి వీరు కీలకంగా పని చేస్తారు. మావోయిస్టు పార్టీలో గతంలో వీరు కూడా పని చేయడం వల్ల వచ్చిన  సుధీర్ఘ అనుభవం పోలీసు బలగాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

 

  • ప్రాంతీయ అవగాహన:  గోప్నీ సైనిక్ లు గ్రామాల్లో  గిరిజనులతో కలిసిపోయి వారితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు. మావోయిస్టు కదలికలు, వారికి సహాయం చేసే కొరియర్ వ్యవస్థల ఆచూకీని కనిపెడతారు. అంతే కాకుండా మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించే బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తారు.

గోప్నీ సైనిక్ లకు జీతభత్యాలు ఏలా అంటే ?

గోప్నీ సైనిక్ లు డీఆర్జీలో అంతర్భాగమే కాని ప్రభుత్వ ఉద్యోగులు అనలేం. వారు డీఆర్జీతో కలిసి పని చేసే ప్రత్యేక రహస్యమైన వ్యవస్థ. వీరి చెల్లింపులను పోలీసులు రహస్యంగా ఉంచుతారు. అయితే వారికి నగదు ప్రోత్సాహకాలు ఉంటాయి. దీంతో పాటు ఇతర ఆర్థిక, సామాజిక సాయం ప్రభుత్వం నుంచి పొందుతారు. ఇటీవలే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రకటించిన నక్సల్స్ లొంగుబాటు, బాధితుల సహాయం - పునరావాస పథకం 2025 కింద మావోయిస్టు ఆపరేషన్లలో మరణించిన గోప్నీ సైనిక్ కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచారు. శాశ్వత వైక్యలం పొందిన వారికి ఇచ్చే పరిహారాన్ని మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచారు. లొంగిపోయిన మావోయిస్టులకు, గోప్నీ సైనిక్ లకు ప్రభుత్వ భూమి, విద్య. ఆరోగ్య సౌకర్యాలు కల్పిస్తారు. ప్రయివేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.

మావోయిస్టులకు గోప్నీ సైనిక్‌లతో జరిగిన నష్టం ఏంటంటే ? 

గోప్నీ సైనిక్ లవల్ల మావోయిస్టులకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఈ పోరాటంలో వీరు ఓ గేమ్ చేంజర్స్ అని చెప్పవచ్చు. వీరి అందించిన పక్కా సమాచారంతోనే మావోయిస్టు అగ్రనేతలు చాలా వరకు పట్టుబడటమో, లేదా ఎన్‌కౌంటర్లో మరణించడమో జరిగింది. వారి కదలికలు, రహస్య స్థావరాలు,  ఆయుధాగారాలు వీరి సమాచారంతోనే పోలీసు బలగాలు చేజిక్కించుకున్నాయి. పక్కా నిఘా సమాచారం ఇవ్వడంలో గోప్నీ సైనిక్‌లు కీలకపాత్ర పోషించారు. గోప్నీ సైనిక్‌ల ప్రభావం కారణంగానే మావోయిస్టులు స్థానిక ప్రజల మద్ధతును కోల్పోయారు. మావోయిస్టులకు నిధులు రాకుండా అడ్డకట్ట వేయడంలోను గోప్నీ సైనిక్‌లు కీలకంగా వ్యహరించారు. వారి ఆయుధ నెట్ వర్క్‌లు, నిధులు ఇచ్చే వ్యక్తులను న్యూట్రలైజ్ చేయగలిగారు. అంతే కాకుండా ఎన్నో ఏళ్ల నుంచి  మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న ప్రాంతాలను పోలీసు బలగాలు చుట్టిముట్టి స్వాధీనం చేసుకోగలిగాయి.

డీఆర్జీ దళాల్లో గోప్నీ సైనికులు ఎంత మంది ఉన్నారంటే  ?

గోప్నీ సైనిక్‌లకు సంంబధించిన వివరాలను ప్రభుత్వం, పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచుతారు. వారి వివరాలు బయటకు పొక్కితే మావోయిస్టుల నుంచి తీవ్ర పరిణామాలను గోప్నీ సైనిక్‌లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వీరి సమాచారం బయటకు తెలియదనే చెప్పాలి. ఆయా నివేదికల ప్రకారం 2015-16 నాటికే  లొంగిపోయిన మాజీ మావోయిస్టులలో దాదాపు 70 నుంచి 80 మంది గోప్నీ సైనిక్ దళంలో చేరినట్లు అంచనా. అయితే బయట ఉన్న ప్రచారం బట్టి  నక్సల్ ప్రభావితం ఉన్న ప్రతీ జిల్లాలో వందల మంది గోప్నీ సైనిక్ లు  పని చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది.  

మావోయిస్టు వ్యతిరేక పోరాటంలో గోప్నీ సైనికుల పాత్ర చాల కీలకమనే చెప్పాలి. ఎంతో ప్రమాదకర విధులను వీరు నిర్వర్తిస్తున్నారు. నిరంతరం ముప్పు పొంచి ఉన్న ఈ పనిని ఇప్పటికీ వీరు నిర్వర్తిస్తున్నారు. అయితే వీరు పొందే ప్రతిఫలానికి వారు చేసే పని చాలా ఎక్కువే. ఏది ఏమైనాఈ వ్యూహాత్మక  గోప్నీ సైనిక్ దళం మావోయిస్టులను న్యూట్రలైజ్ చేయడంలో ఓ గేమ్ ఛేంజర్ అనే చెప్పాలి.