GHMC Commissioner: భారీ వర్షాలతో హైదరాబాద్ బెంబేలెత్తుతోంది. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. దీంతొ నగరంలో రెడ్ అలర్ట్ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సూచించారు. నగరంలోని 141 వాటర్‌లాగింగ్‌ పాయింట్ల వద్ద స్టాటిక్‌, మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు ఎప్పటికప్పుడు నీటిని తొలగించేందుకు చర్యలు చేపడుతున్నాయి. మ్యాన్ హోల్స్ తెరవకూడదన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమ్రపాలి ఆదేశించారు.


 హైడ్రా జీహెచ్‌ఎంసీ సమన్వయంతో పని చేసి ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని తెలిపారు. నగరంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. వర్షం తగ్గే వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలన్నారు. పిల్లలు వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్లపై గుంతలతో ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎలాంటి ప్రమాదం లేకుండా జీహెచ్‌ఎంసీ సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో, ప్రజలు 040 21111111 మరియు 9000113667 నంబర్‌లను సంప్రదించాలి.



భారీ వర్షాలకు నీట మునిగిన ప్రదేశాలు
భారీ వర్షాల ధాటికి షేక్‌పేట్, టోలీచౌకీ, గచ్చిబౌలి, కొండాపూర్, అత్తాపూర్, అమీర్‌పేట్, బేగంపేట్, వంటి ప్రాంతాల్లోని లోతట్టు ప్రదేశాలు జలమయం అయ్యాయి. మురుగునీరు, వరదనీటి పారుదల కాలువల్లో భారీగా చెత్త పేరుకుపోవడం వల్ల అవన్నీ కూడా పొంగిపొర్లుతున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నగర మున్సిపల్ కమిషనర్ ఆమ్రపాలి నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. పలు ప్రాంతాల్లో తిరిగారు. అక్కడి వర్ష తీవ్రత, నష్టాల వివరాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.


 



 
 అవసరమైతేనే బయటకు రండి
 లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద రేన్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ (సంపు) నిర్మాణ పనులును  జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రేపు కూడా అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ నగర ప్రజలు అవసరమైతేనే ఇంటి నుండి బయటకు రావాలి. చిన్నపిల్లలను ఒంటరిగా రోడ్లపై బయటకు పంపవద్దు. ట్రాఫిక్ రిలేటెడ్ 141 వాటర్ లాగిన్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ పంపులు పెట్టి డి- వాటర్ చేస్తున్నాం.  ఈ సంవత్సరం ఉన్న 141వాటర్ లాగిన్ పాయింట్స్ వచ్చే సంవత్సరం నాటికి 50 కి తగ్గేలా ప్రణాళిక చేస్తున్నాం . 22 లేక్స్ సర్ ప్లేస్ కు వచ్చాయి. అన్ని గేట్స్ తెరిచాం. హుస్సేన్ సాగర్ గేట్స్ కూడా తెరిచాము. లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేశాం.. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నాము. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో ఇంకా ఎలాంటి రిస్క్ లేదు. ఆస్తి ప్రాణ నష్టం ఏమీ లేదు.’’ అన్నారు.






24గంటలు పనిచేయనున్న కంట్రోల్ రూం  
అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామని ఆమ్రపాలి తెలిపారు. ముఖ్యంగా పోలీస్, హెడ్రా, ఇరిగేషన్ , జిహెచ్ఎంసి సమన్వయంతో పనిచేస్తుందన్నారు.  పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాలు, కాంపౌండ్ వాల్స్, భవన నిర్మాణా ప్రదేశాలను  డిప్యూటీ కమిషనర్లు టౌన్ ప్లానింగ్ అధికారులు సందర్శించి ప్రమాద అవకాశాలు గల వాటిని గుర్తించి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. నగరంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో మల్టిపుల్ స్టెప్స్ తీసుకుంటున్నామన్నారు. నిర్మాణ స్థలాల చుట్టూ భారికేడ్స్, లైటింగ్ పెట్టించాం.  సెలవులలో ఉన్న అధికారుల సెలవులను రద్దు చేశామన్నారు.



మంత్రుల వీడియో కాన్ఫరెన్స్
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో నేడు రాష్ట్ర సచివాలయం నుండి  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ డా. జితేందర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమీషనర్ సుధీర్ బాబు, సైబరాబాద్ కమీషనర్  అవినాష్ మహంతి కలిసి నెరెడ్ మెట్ లోని రాచకొండ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.  తదనంతరం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రజలు, వాహన దారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, తీసుకోవలసిన నష్టనివారణ చర్యలు, చేపట్టవలసిన సహాయ పునరావాస కార్యక్రమాల ఏర్పాట్లు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కమిషనర్ సుధీర్ బాబు రాచకొండ జోనల్ డీసీపీలు, ఏసిపిలు, ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు. 
Also Read: Hyderabad - Vijayawada Route: వర్షాల ఎఫెక్ట్, హైదరాబాద్ నుంచి ఖమ్మం- విజయవాడ వెళ్లేందుకు కొత్త రూట్‌ లు ఇవే