Gaddar Prajasanti:   ప్రజాగాయకుడు గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ మునుగోడు అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగనున్నారు. రేపటి నుంచి మునుగోడులో ఇంటింటికెళ్లి ప్రచారం చేస్తానని గద్దర్ తెలిపారు. ఈ సందర్భంగా కేఏ పాల్ ఆమరణ దీక్ష విరమించారు. గద్దర్ తనతో నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు. అక్టోబర్ 2న పీస్ మీటింగ్ కు పోలీసులు పర్మిషన్ నిరాకరించడాన్ని నిరసిస్తూ పాల్ ఆమరణ దీక్ష చేపట్టారు.  గద్దర్ గతంలో తన కొడుకుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత నుంచి ఆయన కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీలతో సన్నిహితంగానే ఉన్నారు. తన కొడుకు కోసమే గద్దర్ కాంగ్రెస్ లో చేరారనే వాదనలున్నాయి. ప్రస్తుతం ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.  


గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్దర్


ప్రజాశాంతి పార్టీని ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. అయితే గద్దర్ మాత్రం  ప్రజాశాంతి పార్టీలో చేరి ఏకంగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. విప్లవ ఉద్యమాలలో ఆయన చరిత్ర తెలిసిన వారు ఇలా కేఏ పాల్ పార్టీతో ప్రజా జీవితంలోకి వస్తారని ఎవరూ ఊహించలేకపోయారు. అయితే గద్దర్ ఇటీవలి కాలంలో వ్యవహరి్సతున్న తీరును పరిశీలిస్తున్న వారికి ఇదేమంత ఆశ్చర్యం అనిపించలేదు. ఆయన పూర్తిగా తాను నమ్మిన సిద్దాంతాలను వదిలేశారు. ఆలయాలకు వెళ్తున్నారు. దేవుడి పాటలు పాడుతున్నారు. సూటేసుకుని రాజకీయ పార్టీల సమావేశాలకు వెళ్తున్నారు. ఆయన పూర్తిగా మారిపోయారని ఇటీవలి పరిణామాలు చెబుతున్నాయి. 


ఇటీవల పూర్తిగా మారిపోయిన గద్దర్ వ్యవహారశైలి


కొద్ది రోజుల కిందట ఆయన ఢిల్లీలో కొత్తగా కడుతున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అన్ని రాజకీయ పార్టీలనూ కోరారు. ఇందు కోసం స్వయంగా ఆయా పార్టీల నేతల ఇళ్లకూ వెళ్లారు. ఆఫీసుకూ వెళ్లారు. ఇటీవల తెలంగాణ పర్యటనకు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఆయనతో నూ సమావేశం అయ్యారు. గతంలో లా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే ఆయనకు ప్రాధాన్యం లభించి ఉండేది. కానీ అనూహ్యంగా ప్రజా శాంతి పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మత ప్రచారకర్తగా పేరు పొందిన కేఏ పాల్ .. ఇటీవలి కాలంలో రాజకీయాల పేరుతో హడావుడి చేస్తున్నారు.


తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేఏ పాల్ 


గత ఎన్నికల సమయంలో ఏపీలో ఆయన ఎక్కువగా పోటీ చేశారు. ఈ సారి అమెరికా నుంచి వచ్చి తెలంగాణపై దృష్టి సారించారు. అమరవీరుడు శ్రీకాంతాచారి తండ్రిని తన పార్టీలో చేర్చుకుని వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించేశారు. అయితే తర్వాత ఆ విషయం వివాదాస్పదమైంది. శ్రీకాంతాచారి తల్లి తన భర్తను కేఏ పాల్ అపహరించారని కేసులు పెట్టారు. చివరికి ఈ వివాదం సద్దుమణిగింది. తర్వాత ఏపీలో యాత్ర చేశారు. ఇప్పుడు మునుగోడులో గద్దర్‌ని అభ్యర్థిగా ఖరారు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.  మునుగోడు ఓటర్లకు పాస్‌పోస్టులు .. వీసాలు ఇస్తాననే హామీలు ఇప్పటికే ఇచ్చారు.