Trending
Dundubhi River: దుందుభి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు, ఎమ్మెల్యేపై ప్రశంసల వర్షం
Telangana News | నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో దుందుభి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

Nagarkurnool MLA Rajesh Reddy | నాగర్ కర్నూలు: నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో మరో కలికితురాయి చేరనుంది. రాష్ట్ర ప్రభుత్వం దుందుభి వాగుపై 20 కోట్ల 20 లక్షల రూపాయలతో నూతన బ్రిడ్జి నిర్మించనుంది. ఈ మేరకు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలకు నిర్ణయం తీసుకుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం కనుక పూర్తయితే ఇటు నాగర్ కర్నూల్, జడ్చర్లతో పాటు కల్వకుర్తి నియోజక వర్గాల మధ్య రాకపోకలకు అంతరాయం తొలగనుంది. దుంధుబి వాగుపై బ్రిడ్జి ద్వారా తాడూరు మండలం సిరసవాడ గ్రామ ప్రజల కష్టాలు తీరనున్నాయి.
బ్రిడ్జి నిర్మాణానికి పెరుగుతున్న డిమాండ్
ఎన్నో ఏళ్ల నుంచి దుంధుబి వాగు మీద బ్రిడ్జి నిర్మించాలని స్థానికంగా డిమాండ్ ఉంది. ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా ప్రయోజనం లేదు. గత ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిర రాజేష్ రెడ్డి తక్కువ కాలంలోనే నియోజకవర్గంపై పట్టు సాధిస్తున్నారు. ఏడాదిన్నర వ్యవధిలోనే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కావడంతో ఆయన ప్రభుత్వం దృష్టికి విషయం తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం రూ.20.20 కోట్లతో దుంధుబి వాగుమీద బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ శుక్రవారం నాడు జీవో జారీ చేసింది. దాంతో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎన్నో ఏళ్ల కల అయినా ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు సాధించడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. తాడూర్ మండలం సిరసవాడ ప్రజల కళ నెరవేరబోతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను అర్థం చేసుకుని కొత్త బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరుకు జీవో వెలువడిన అనంతరం.. సీఎం రేవంత్ రెడ్డికి, సంబంధిత శాఖ మంత్రి ధనసరి సీతక్కకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎమ్మెల్యే చొరవతో స్పందించిన ప్రభుత్వం
భారీ వర్షాలకు దుందుభి నదిపై నిర్మించిన తాత్కాలిక బ్రిడ్జి కొట్టుకుపోవడంతో మండల ప్రజలు తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించి, ఫొటోలు, వీడియోలను ప్రభుత్వానికి సమర్పించారు. బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని.. మూడు నియోజకవర్గాల ప్రజలకు ఇది ఉపయోగకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రభుత్వ పెద్దలను ఒప్పించి నిధులు సాధించారు. తాడూరు మండల వాసులతో పాటు నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ నేతలు రాజేష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లకి ఎమ్మెల్యే భూమి పూజ
నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. బిజ్నాపల్లి మండలంలో, తిమ్మాజిపేట మండలంలో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టారు. బిజ్నాపల్లి మండలం అల్లీపూర్ గ్రామంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఆ ఇంటికి భూమి పూజ చేసిన రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మాయమాటలు చెప్పిందన్నారు. కానీ ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్ల ఇస్తున్నాం అన్నారు.
తిమ్మాజిపేట మండలం ఇప్పలపల్లి గ్రామంలో ఓ నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి శుక్రవారం నాడు ఇందిరమ్మ ఇండ్లకి భూమి పూజ చేశారు. ఈ కార్యకరమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, సింగల్ విండో మాజీ చైర్మన్ వెంకట్ స్వామి, మండల అధ్యక్షుడు మిద్దె రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నసీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.