Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో కాలంగా వేచి చూస్తున్న వందే భారత్ రైలు ఈరోజు ప్రారంభం అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ కేవలం ధనికులకు మాత్రమేనని.. సామాన్య ప్రజలకు ఏమాత్రం అందుబాటులో ఉండదని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఇలా పేద ప్రజలకు ఉపయోగపడని ఈ రైలు గురించి ఎందుకు అంతగా ప్రచారం చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు.


పండగ పూట రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నాని.. కానీ మాట్లాడక తప్పడం లేదని చెప్పారు. ప్రధాని మోదీ, ఇద్దరు కేంద్ర మంత్రులు, గవర్నర్.. ఇలా ప్రతీ ఒక్కరూ వందే భారత్ ఎక్స్ ప్రెస్ గురించి విస్తృతంగా ప్రచారం చేయడం అవసరమా అంటూ ప్రశ్నించారు. వందే భారత్ రైలును సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నానికి రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు కొనసాగింపుగా ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారని చెప్పుకొచ్చారు. 


అయితే ఇదేం మొదటి రైలు కాదని... ఇప్పటి వరకు రోజు, వారాంతాల్లో 17 రైళ్లు నడుస్తున్నాయని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ 18వ రైలు అని... కానీ ఇదే మొదటి రైలు అన్నట్లుగా ప్రచారం చేసుకోవడం బాధాకరం అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా.. కొత్త పేర్లు, కొత్త నినాదాలు, ప్రచారాలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పార్లమెంట్ సాక్షిగా చేసిన విభజన చట్టంలోని అంశాలు 8 ఏళ్లలో ఏ ఒక్కటి అయినా నెరవేర్చారా అని ప్రశ్నించారు. 


వందే భారత్ రైలు టికెట్ ధరలు ఇవే...!


తెలుగు రాష్ట్రాల మధ్యన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు నేటి నుంచి (జనవరి 15) ప్రారంభం కానుంది. బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అయితే, దీనికి సంబంధించి ఛార్జీల వివరాలు బయటకొచ్చాయి. సోమవారం (జనవరి 16) నుంచి జరిగే ప్రయాణానికి గానూ ప్రయాణికులు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. టికెట్ కేటగిరీల్లో రెండు రకాలు చైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌ అనేవి ఉన్నాయి. అయితే, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు టికెట్ ధర ఎంత ఉందో.. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నానికి టికెట్ ధర అంతే లేదు. చైర్ కార్, ఎగ్జిక్యుటివ్ చైర్ కార్ టికెట్ ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపిస్తోంది.


విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు చైర్‌కార్‌ టికెట్‌ రేటు రూ.1,720, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ టికెట్‌ రేటు రూ.3,170గా ఉంది. అదే సికింద్రాబాద్ నుంచి బయల్దేరి వెళ్లే సర్వీసులో విశాఖపట్నానికి ఛైర్‌ కార్‌ టికెట్‌ ధర రూ.1,665, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ రూ.3,120గా పేర్కొన్నారు. ఈ టికెట్‌ రేట్లలో కొంచెం తేడా ఉంది. సాధారణంగా అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరమో, ఇక్కడి నుంచి అక్కడికి అంతే దూరం. అయినా అప్ అండ్‌ డౌన్‌ ట్రైన్‌ టికెట్‌ ధరలు ఇలా వేర్వేరుగా ఉన్నాయి. అయితే, మొత్తం టికెట్ ధరలో కలిసిపోయి ఉన్న కేటరింగ్‌కు సంబంధించిన ఛార్జీలు వేర్వేరుగా ఉండడంతో ఈ తేడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.