Former Muthol MLA Vitthal Reddy joined Congress : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది.   ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలంతా వరుసకట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ చేరగా, గురువారం ముథోల్ మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రేడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి సీతక్క విఠల్ రెడ్డిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2014 లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన విఠల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం ఎన్నో రోజులుగా సాగుతోంది. 


మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, విఠల్ రెడ్డి ఇద్దరూ కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే  ఇంద్రకరణ్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ అక్కడి కాంగ్రెస్ నేతలు ఆందోళనలు నిర్వహించారు. దీంతో ఇంద్రకరణ్ రెడ్డి కంటే ముందు విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదే తరహాలో మరికొంతమంది బీఅర్ఎస్ నేతలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలవేళ నేతలు ఒక్కొక్కరుగా బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోంది. దీని ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బిఆర్ఎస్ లో ఉన్న నేతలు ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు సైతం కంగు తింటున్నారు. పార్టీలో మళ్లీ తమకు ముందు దిక్కు ఉంటుందో ఉండదోనని గుస గుసలు మాట్లాడుకుంటూ ఆందోళన చెందుతున్నారు. 


 ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కాళీ అవుతున్నట్టు అర్థమవుతోంది. వాస్తవానికి గత ఎన్నికల కంటే ముందు వరకు బీఆర్ఎస్ కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కంచుకోటగా ఉండేది. ఈ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అధికంగా ఉండేవారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి ఓడిపోయారు. బోథ్, ఖానాపూర్ ఎమ్మెల్యేలకు పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో వారిద్దరూ వేరే పార్టీలో చేరారు. దీంతో ఈ జిల్లాలో బీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి.                  


వారం రోజుల కిందట  ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి కూడా ఇంద్రకరణ్ రెడ్డి, విఠల్ రెడ్డి హాజరు కాలేదు.  మాజీ మంత్రులు జోగు రామన్న, వేణుగోపాలాచారి, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పార్టీ సీనియర్ నాయకులు  మాత్రమే పాల్గొన్నారు. పార్టీ నేతలు వీడినా కొద్దిగా కష్టపడితే గెలుపు బీఆర్ఎస్‌దేనని.. కేసీఆర్ వారికి సర్ది చెప్పారు.  ఆత్రం సక్కును అభ్యర్థిగా ఖరారు చేశారు.