అమెరికాలో ఓ మహిళ తన 16 నెలల పసికందును ఇంట్లోనే వదిలి తాళం పెట్టి వెళ్లిపోయింది. దీంతో ఆ పసికందు ఆకలిని తాళలేక కన్నుమూసింది. ఈ ఘటనను విచారించిన కోర్టు ఆ అమ్మకు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఏం జరిగిందని అందరూ ఆరా తీస్తున్నారు.
ఏం జరిగింది..?
అమెరికా(America)లోని ఓహియో(Ohio) రాష్ట్రంలో ఉన్న క్లీవ్ ల్యాండ్ లో క్రిస్టెల్ కాండెలారియో(32)(Christel candelario) అనే మహిళ నివసిస్తున్నారు. ఈమెకు 16 నెలల పసికందు(ఆడపిల్ల) జైలిన్(Jailin) ఉంది. అయితే..సాధారణంగా తల్లులు బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తమ పిల్లలను వెంట బెట్టుకుని వెళ్తారు. కానీ, క్రిస్టెల్ కాండెలారియో మాత్రం తన 16 నెలల పసికందు విషయంలో ఏమైందో ఏమో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. 10 రోజుల పాటు సెలవులు పెట్టి.. వెకేషన్‌కు వెళ్లిపోయింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ చిన్నారి ఆకలికి తాళలేక.. తన వారు కనిపించక.. దిగులుతో ఏడ్చి ఏడ్చి.. చివరకు కన్ను మూసింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు క్రిస్టెలా కాండెలారియోపై కేసు నమోదు చేశారు. దీనిని విచారించిన కోర్టు ఆమె చేసిన నేరంపై తీవ్రస్థాయిలో మండిపడింది. ``మనసెలా వచ్చిందమ్మా`` అని మందలించడంతోపాటు.. జీవిత ఖైదును విధించింది.
కోర్టు సంచలన వ్యాఖ్యలు..
ఓహియో మహిళ క్రిస్టెల్ కాండెలారియోపై క్లీవ్‌ల్యాండ్‌లోని స్టేట్ కోర్ట్‌హౌస్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. పసికందు జైలిన్‌ది తీవ్రమైన హత్యగా పేర్కొంది. పిల్లలను సంరక్షించాల్సిన తల్లి ఇలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం దారుణమని వ్యాఖ్యానించింది. దీనికి కారణమైన క్రెస్టెలా కాండెలారియోకు జీవిత ఖైదే సరైన శిక్ష అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. క్యాండెలారియో కేసును పర్యవేక్షించిన న్యాయమూర్తి బ్రెండన్ షీహన్.. కోర్టులో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం లేకుండా పసిపిల్లల ఇంటిలో ఒంటరిగా వదిలివేయడాన్ని ``దారుణ ద్రోహం``గా పేర్కొన్నారు. చట్టపరం చూస్తే.. ఇలా చేయడం.. చిన్నారులను ఉద్దేశ పూర్వకంగా హత్య చేసినట్టేనని ఆయన అభివర్ణించారు. "మీరు జైలిన్‌ను నిర్బంధంలో ఉంచిన నేరానికి మీరు కూడా మీ శేష జీవితాన్ని స్వేచ్ఛ లేకుండా సెల్‌లో గడపాలి" అని న్యాయమూర్తి షీహన్ తన తీర్పులో పేర్కొన్నారు.
క్షమాపణలు కోరినా..
తాను చేసిన నేరానికి కాండేలారియో కోర్టును క్షమాపణలు కోరారు. అంతేకాదు.. తాను చేసింది తప్పేనని, దేవుడి ముందు కూడా ఒప్పుకొన్నానని.. ప్రతిరోజూ ప్రార్థిస్తున్నానని.. నన్ను క్షమించండని కాండేలారియో కన్నీరు మున్నీరుగా కోర్టులోనే విలపించారు. "నా బిడ్డ జైలిన్‌ను కోల్పోయినందుకు నాకు చాలా బాధ ఉంది. నేను చేసింది ముమ్మాటికీ తప్పే. ఉద్దేశ పూర్వకంగా చేయలేదు. నన్ను క్షమించండి`` అని ఆమె వేడుకుంది. అంతేకాదు.. తాను మానసిక సమస్యలతో పోరాడుతున్నానని చెప్పారు.