Mallareddy MLA : కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్టు తమ కుటుంబం నుంచి 3 పదవులు ఉండాలని అనుకున్నామని మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. పార్టీ అధినేత ఆదేశిస్తే.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు తమ కుమారుడు భద్రారెడ్డి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. టికెట్ విషయం దాదాపు ఖరారైందన్న స్పష్టతనిచ్చారు. తమ కుటుంబాన్ని కాదని.. పోటీ చేసేంత శక్తికానీ, సామర్థ్యం కానీ ఎవరికీ లేదంటూ మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. తాను ఎమ్మెల్యేగా ఉండగా.. తన కుమారుడిగి ఎంపీ టికెట్ ఆశించటం వల్ల.. మళ్లీ వారసత్వ రాజకీయాల అంశం తెరమీదికి వస్తుందన్న ప్రశ్నకు.. సీఆర్ కుటుంబంలో ముగ్గురు పదవుల్లో ఉన్నారని.. అలా చూసుకుంటే వాళ్ల తర్వాత తన కుటుంబంలోనే ఎక్కువ మంది పదవుల్లో ఉన్నట్టువుతుంది కదా అంటూ సరదాగా చమత్కరించారు.
ఎంపీ టికెట్ కోసం సీఎం రేవంత్‌రెడ్డిని జగ్గారెడ్డి పొగుడుతున్నారని మల్లారెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఫోకస్ కావడం కోసం తన పేరు ప్రస్తావిస్తున్నారని పేర్కొన్నారు. తన పేరు చెప్పకపోతే జగ్గారెడ్డిని ఎవరూ పట్టించుకోరన్నారు. గతంలో రేవంత్‌రెడ్డిపై తాను చేసిన విమర్శలు అందరికీ గుర్తున్నాయని మల్లారెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తన భార్యతో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలవటంపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు సిద్ధమయ్యారని.. అందుకే స్పెషల్‌గా సతీమణితో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే.. ఇప్పటికే.. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించిన మల్లారెడ్డి.. ఆ వార్తల్లో కూడా నిజం ఉందని స్పష్టం చేశారు. కాగా.. రంజిత్ రెడ్డి వెళ్లకముందే పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంపై కర్చీఫ్ వేశారంటూ చెప్పుకొచ్చారు.
గోవాలో తనకు హోటల్ ఉంది. రాజకీయాల నుంచి తప్పుకొంటే అక్కడికే వెళ్లి ఎంజాయ్ చేస్తానని ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. మనిషి జీవితం ఒకేసారి వస్తుందన్నారు. ప్రతి క్షణం జీవితాన్ని ఎంజాయ్ చేయాలని మల్లారెడ్డి పేర్కొన్నారు. ఇటీవలే మల్లారెడ్డి గోవాతో పాటు దుబాయ్ లో కూడా పర్యటించి వచ్చారు. అక్కడ ఆయనకు సుఖంగా ఉందేమో కానీ గోవా వెళ్లిపోతానని కామెంట్లు చేస్తున్నారు.