Syed Sohel about his Struggles: బిగ్ బాస్ అనే రియాలిటీ షోలోకి వచ్చి విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు సయ్యద్ సోహెల్. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా వచ్చాడు సోహెల్. విన్నర్‌గా నిలిచిన అభిజిత్ కంటే సోహెల్‌కే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. దీంతో హీరోగా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. కానీ తను ఆశించినంత రేంజ్‌లో తన సినిమాలు సక్సెస్ అవ్వడం లేదు. దీంతో రెండేళ్లుగా తన పడుతున్న కష్టాల గురించి బయటపెట్టాడు సోహెల్. తనకు లక్ కలిసి రావడం లేదని బాధపడ్డాడు.


అలా హీరోగా మొదటి అవకాశం..


‘కొత్త బంగారులోకం’ మూవీలో హీరో ఫ్రెండ్‌గా చిన్న పాత్రలో కనిపించాడు సోహెల్. ఆ సినిమాకు పనిచేసిన మ్యానేజర్ పిలిచాడని ఆడిషన్‌కు వెళ్తే.. తనకు ‘మ్యూజిక్ మ్యాజిక్’ అనే చిత్రంలో మొదటిగా హీరోగా అవకాశం వచ్చిందని సోహెల్ బయటపెట్టాడు. కేవలం పచ్చడితోనే తిని బ్రతికామని తన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. క్యాటరింగ్ పనిచేసినా కూడా అది తమ రూమ్ రెంట్‌కు, ఇతర ఖర్చులకు సరిపోయేదని అన్నాడు. యాక్టర్ అవుదామనుకొని అరడజనుకు పైగా సినిమాలు చేసినా సక్సెస్ దక్కలేదని వాపోయాడు. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చాలావరకు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించాడు సోహెల్. ఆయనతో వాతావరణం అంతా బాగుంటుందని బయటపెట్టాడు. తాను చేసిన సినిమాలతో నటుడిగా ప్రూవ్ చేసుకున్నానని అన్నాడు.


ఎవ్వరూ నావాళ్లు కాదు..


ఎన్ని సినిమాలు చేసినా కోరుకున్న సక్సెస్ దక్కడం లేదంటూ సోహెల్ వాపోయాడు. ‘‘నాలో లోపం ఉందేమో. సరిగ్గా జడ్జ్‌మెంట్ చేయలేకపోతున్నానేమో. ఎస్వీ కృష్ణారెడ్డితో చేసినా కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదంటే మనం కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. దాని గురించి మనమేం చెప్పలేం. పబ్లిసిటీ లేకపోవడం వల్ల ఇలా అవుతుందని అనుకోవచ్చు. సినిమా ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు పోయిందో కూడా చాలామందికి తెలీదు. హార్డ్ వర్క్‌తో పాటు రిజల్డ్‌ను కూడా ఫేస్ చేయాలి. ఎవ్వరూ నీ వాళ్లు కాదు. ఏదైతే ఔట్‌పుట్ ఇచ్చిందో.. అదే సమాధానమివ్వాలి. ఏడ్చినా.. ఏం చేసినా పట్టించుకునేవాడు ఎవ్వడూ లేడు. నీ వాల్యూ నువ్వు తెలుసుకో. రిజల్ట్ అనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు’’ అని చెప్పుకొచ్చాడు. తన సినిమా వస్తుందని ప్రేక్షకుల్లో ఎగ్జైట్‌మెంట్ రావాలని, అది తాను క్రియేట్ చేయలేకపోయానని ఓపెన్‌గా చెప్పేశాడు.


కంటెంట్‌తో వస్తా..


సినిమాల నుండి కాస్త బ్రేక్ తీసుకుందామనే ఆలోచనలో ఉన్నట్టు సోహెల్ చెప్పాడు. దానికి కారణమేంటని అడగగా.. రెండేళ్ల నుండి తనకు అస్సలు బాలేదని చెప్పుకొచ్చాడు. తాను సెలబ్రిటీ అనే ఫీలింగ్ ఉండదని, కెమెరా ముందు ఏం మాట్లాడాలో తెలియదని.. దాని వల్లే చాలా ఇబ్బందులు ఎదుర్కున్నానని అన్నాడు. ఆ అలవాటు వల్లే తనతో పాటు తన కో యాక్టర్లకు, నిర్మాతలకు కూడా డ్యామేజ్ అయిన రోజులు ఉన్నాయని తెలిపాడు. ‘‘సెలబ్రిటీని కాబట్టి ఎమోషన్స్‌ను కంట్రోల్‌లో పెట్టుకోవాలని చాలామంది చెప్పారు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ దర్శకుడు మాత్రం నన్ను కంట్రోల్‌లో పెట్టగలిగాడు. వార్నింగ్ ఇచ్చాడు. నేను చాలా సెన్సిటివ్, ఎక్కువగా ఆలోచిస్తాను. ఇవి రెండూ నా జీవితంలో అతిపెద్ద లోపాలు’’ అని అన్నాడు. తను బాధను చెప్పుకున్నప్పుడు చాలామంది వాటిని ఎంజాయ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారని వాపోయాడు. త్వరలోనే కంటెంట్‌తో వచ్చి అందరికీ సమాధానం చెప్తానని గట్టిగా చెప్పాడు సోహెల్.


Also Read: 'హనుమాన్‌' రెమ్యునరేషన్‌ వివాదం - క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్‌ వర్మ