తెలుగు రాష్ట్రాల్లో వానలు విస్తరంగా పడుతున్నాయి. కొంచెం గ్యాప్ ఇచ్చినట్టు కనిపించిన వరుణుడు.. మళ్లీ దంచికొడుతున్నాడు. ఎగువన కురుస్తున్న వానలతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి నీటిమట్టం 48 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 


అత్యవసర సేవల కంట్రోల్‌ నంబర్లు 



  • 08744-241950, 08743-232444 

  • వాట్సప్ నెంబర్: 93929 19743


నిన్న 20 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం ఇవాళ మార్నింగ్ వరకు 43 అడుగులకు చేరుకుంది. ఈ కారణంగా అధికారులు ఉదయం మెుదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం 48 అడుగులకు నీటిమట్టం చేరగా.. రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 
ప్రస్తుతం గోదావరి వరద  ప్రవాహం 11,41,10 క్యూసెక్కులు. ఎగువ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. భద్రాచలం స్నానఘట్టాల ప్రాంతంతో పాటు మెట్లు, విద్యుత్‌ స్తంభాలు నీటిలో మునిగాయి.  లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ఇంకా పెరుగుతున్నందున.. నీటి మట్టం ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తోంది.


వరదలు ఎక్కువగా ఉండటంతో పర్ణశాల దగ్గర సీతావాగులోని సీతమ్మ విగ్రహం, నార చీరల ప్రాంతం నీటిలో మునిగింది. గోదావరి ప్రవాహం దృష్ట్యా... ములుగు జిల్లాలో ముంపు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.  తుపాకుల గూడెంలోని సమ్మక్క సాగరం బ్యారేజీ వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.


కృష్ణమ్మకు భారీ వరద


ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతోంది. ప్రాజెక్టులోకి 3,70,817క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 855.60 అడుగులుగా ఉంది. ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 25,427క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.


నీట మునిగిన సంగమేశ్వర ఆలయం


కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర ఆలయం నీట మునిగింది. ఎగువ రాష్ట్రాల్లోనూ, రాష్ట్రంలోనూ కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో వరద నీటి తాకిడికి శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర ఆలయం నీట మునిగింది. ఆలయ గోపురం వరకు నీరు చేరింది.


 


Also Read: ap rains: నీట మునిగిన పోలవరం నిర్వాసిత గ్రామాలు