కరోనా కల్లోలంతో బోధన మొత్తం ఆన్ లైన్లో నడుస్తోంది. పరీక్షల సంగతేంటని ఆరంభంలో అందరికీ సందేహం వచ్చినా…పరిస్థితిని బట్టి నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేశాయి. కానీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పాటూ మరింత తీవ్రంగా మారడంతో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం సరికాదని భావించారు పాలకులు. ఈ మేరకు పరీక్షలు రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్ చేశారు. ఈ మేరకు ఫలితాలు విడుదలచేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదలకాగా… తాజాగా ఐసీఎస్‌ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. దాదాపు మూడు లక్షల మందికి పైగా విద్యార్థులు ఎదురు చూస్తున్న ఈ ఫలితాలను cisce.org లేదా results.cisce.orgలో అందుబాటులో ఉంచారు.




ఈ ఏడాది ఐసీఎస్‌ఈ పదో తరగతిలో 99.98శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఐఎస్‌సీ 12వ తరగతిలో 99.76శాతం నమోదైంది. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కూడా ఈ ఫలితాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా కెరీర్స్‌ పోర్టల్‌ ద్వారా టాబ్యులేషన్ రిజిస్ట్రర్లను పాఠశాలలకు అందుబాటులో ఉంచుతున్నట్టు సీఐఎస్‌సీఈ బోర్డు కార్యదర్శి గెర్రీ అరథోన్‌ ఇప్పటికే వెల్లడించారు.




సీఐఎస్‌సీఈ ఫలితాలను తెలుసుకొనేందుకు ఐసీఎస్‌ఈ విద్యార్థులైతే ICSE (Unique ID) టైప్‌ చేసి 09248082883 నంబర్‌కు పంపాలి. అలాగే, ఐఎస్‌సీ 12వ తరగతి విద్యార్థులైతే ISC (unique ID) టైప్‌ చేసి పైన పేర్కొన్న నెంబర్‌కే పంపి ఫలితాలు పొందవచ్చు.




కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగడంతో పరీక్షలు రద్దు చేసిన ఐసీఎస్‌ఈ పదో తరగతి బోర్డు….విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఫలితాలను ప్రకటించారు. నిష్పాక్షిక, పారదర్శక విధానంలో విద్యార్థుల ప్రతిభను మదింపు వేసి ఫలితాలను ప్రకటించారు. ఫలితాలు, కేటాయించిన మార్కులకు సంబంధించి విద్యార్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే పాఠశాలల్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యంతరాలను తెలియజేయడానికి ఆగస్టు 1 వరకు గడువు ఇస్తున్నట్టు సీఐఎసీఈ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఫలితాలతో ఎవరైనా సంతృప్తి చెందకపోతే వారికి కరోనాతో నెలకొన్న పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాక పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇప్పటికే బోర్డు స్పష్టంచేసింది.




ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దుచేసి…విద్యార్థుల మెరిట్ ఆధారంగా మార్కులు కేటాయించాయి. అయితే తెలంగాణలో పలువురు ఇంటర్ విద్యార్థులు అందుకు అంగీరంచలేదు. పరీక్ష నిర్వహించి ఉంటే ఇంకా ఎక్కుల మార్కులు వచ్చేవని…తాము పరీక్ష రాసేందుకు సిద్ధమంటూ తెలంగాణ ఇంటర్ బోర్డను ఆశ్రయించారు. మరి  ఐసీఎస్‌ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి విద్యార్థులు తమకు వచ్చిన మార్కులతో సంతృప్తి చెందుతారో… లేదా పరీక్ష రాసేందుకు కొందరు ముందుకొస్తారో చూడాలి….