ఈ తెల్లవారు జామున హైదరాబాద్‌లోని జీడిమెట్లలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు స్పాట్‌లోనే చనిపోయారు. నాసెన్స్‌ కెమికల్ ఇండస్ట్రీలో ప్రమాదం జరిగింది. 


ఉదయం విధులు ప్రారంభమైన కొద్దిసేపటికే పరిశ్రమలోని ఓ రియాక్టర్ పేలింది. ఈ కారణంగా  మంటలు ఎగిసిపడ్డాయి. వెంటవెంటనే మరికొన్ని రియాక్టర్లు పేలాయి. 


ప్రమాద సమయంలో భారీ శబ్ధాలతో రసాయన డ్రమ్ములు పేలాయి. పరిశ్రమలో మొత్తం పది రియాక్టర్లు ఉండగా... నాలుగు రియాక్టర్లు పేలాయి. అందుకే మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.


యాక్సిడెంట్ టైంలో చాలా మంది కార్మికులు ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. స్పాట్‌లోనే ఇద్దరు కార్మికులు చనిపోయినట్టు తెలుస్తోంది. వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


పరిశ్రమలో హరిప్రసాద్, అర్జున్, మనీష్ బస్కీ అనే ముగ్గురు సిబ్బంది మంటల్లో చిక్కుకున్నారు. మంటలు అంటుకొని ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. 


ఈ దుర్ఘటనలో విజయ్ అనే కార్మికుడు కనిపించకపోవడం కలకలం రేపింది. మంటలు ఆర్పిన తర్వాత ఆయన కోసం గాలిస్తున్నారు. 


ప్రమాదం జరిగిన వెంటనే ఆ ఏరియాలో పొగ కమ్మేసింది. స్థానికులు ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఏదో జరిగిందని తెలుసుకొని ఫైర్‌ సేఫ్టీ డిపార్టమెంట్‌కు కాల్ చేసి చెప్పారు. 


ఈ విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే.. ఘటన స్థలానికి వచ్చి.. మంటలార్పుతున్నారు. నాలుగు ఫైరింజన్లతోపాటు నీటి ట్యాంకర్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. బాయిలర్ పేలడం కారణంగానే.. ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.