తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం రోజు రోజుకీ పెరిగిపోతుంది. వడ గాల్పులు తీవ్రమవుతున్నాయి. మార్చి నెలలోనే ఎండలు 43 డిగ్రీలు దాటేస్తున్నాయి. దీంతో ఏప్రిల్, మే నెలలో ఎండలు మరింత తీవ్రంగా ఉండొచ్చని వాతావరణ కేంద్రాలు అంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్ రోజురోజుకీ పెరుగుతోంది. తెలంగాణలో పదేళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా చాప్రాలలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరో నాలుగు రోజులు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మార్చి నెలాఖరుకే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ సాధారణం కన్నా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విజయనగరంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం చెబుతోంది. రాయలసీమ జిల్లాలోనూ అదే పరిస్థితి ఉంది. మధ్యాహ్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తుంది. విజయవాడ, విశాఖలోనూ ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఇప్పటికే 40 డిగ్రీల గరిష్ట ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణలో
ఎండా కాలం తెలంగాణలో ( Telangana ) ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. రానున్న నాలుగు రోజుల్లో ఉత్తర తెలంగాణా జిల్లాలతోపాటు నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్ తదితర జిల్లాల్లో రెండు నుండి నాలుగు డిగ్రీల మేరకు ఉష్టోగ్రతలు ( Summer Heat )పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇలా అనూహ్యంగా పెరగడం వల్ల ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఎండ తీవ్రత.. ప్రజలను అప్రమత్తం చేసే అంశంగా సోమేష్ కుమార్ ( CS Somesh Kumar )కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
అధికారుల అప్రమత్తం
జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ( Summer )మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ (Weather) హెచ్చరించిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, అన్ని ఆసుపత్రుల్లో వైదులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని సోమేష్ కుమార్ ఆదేశించారు. ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను ( ORS pockets )అందుబాటులో ఉంచాలని అన్నారు. ఎండ తీవ్రత వల్ల ఏవిధమైన ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఎండల ప్రభావం వల్ల కలిగే ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్య ప్రర్చాలని సి.ఎస్. కలెక్టర్లను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
పాఠశాలల సమయాల్లో మార్పులు
తెలంగాణలో పాఠశాలలు ఉదయం 11.30 గంటల వరకే నడపనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. గురువారం నుంచి ఉదయం 11.30 గంటల వరకే విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని పేర్కొంది. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తాయి. ఈవిధంగా ఏప్రిల్ 6వ తేదీ వరకు పాటించాలని విద్యాశాఖ ఆదేశాల్లో తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.