Etala Rajendar :   కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణ రాష్ట్రానికి రూ. 40వేల కోట్ల ఆదాయం తగ్గిపోయిందని  టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఈ అంశంపై కొద్ది రోజులుగా గగ్గోలు పెడుతున్నారని. పత్రికల్లో వార్తలు రాయిస్తున్నారని.. కానీ నిజాలు మాత్రం చెప్పడం లేదన్నారు.  ఎఫ్ఆర్బియం పరిధిలోని రుణాల్లో 15 వేల కోట్ల రూపాయలు కోత పెట్టారని..  గ్యారెంటీ రుణాలలో కోత పెట్టారు అని మొత్తం.. 40 వేల కోట్ల రూపాయల రుణాలు రాకుండా చేస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తోందన్నారు.  కానీ ఇవి అన్ని రుణాలని గుర్తుంచుకోవాలన్నారు.   సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్  కింద లేదా గ్రాంట్ కింద వచ్చే డబ్బు కాదని గుర్తు చేశారు.  


పరిమితికి మించి అప్పులు చేసిందన్న కాగ్ రిపోర్టు వల్లే రుణాలపై ఆంక్షలు


అది తెలంగాణ ప్రభుత్వం తీసుకునే అప్పు. ఇప్పటికే పరిధి దాటిపోయి అప్పులు చేశారని కాగ్ రిపోర్టు ఇవ్వడం వల్లనే అదనపు అప్పులకు పర్మిషన్ దొరకలేదన్నారు. అప్పుల కుప్పగా తెలంగాణను మార్చేసి ఇంకా అప్పులు ఇవ్వడం లేదని నిందను కేంద్రంపై వేస్తున్నారని్ మండిపడ్డారు.  ఇప్పటికైనా పద్ధతి నేర్చుకోలని ఈటల రాజేందర్ సలహా ఇచ్చారు.  రాజ్యాంగబద్ధంగా  రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర రిప్రజెంట్ చేయాలని.. .మాట్లాడాలి అనుమతులు తెచ్చుకోవాలన్నారు.  తప్పుడు ప్రచారం చేసి ..  కేంద్రం మీద ప్రజల్ని ఉసికొలిపి రాజకీయ పబ్బం గడుపుకుంట అంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.ముమ్మాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి, మోసం చేసి, అప్పుల కుంపటిలా చేసి  ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని.. దీని నుంచి మీరు తప్పించుకోలేరని కేసీఆర్‌కు హెచ్చరిక జారీ చేశారు. 


బడ్జెట్ సన్నాహాక సమావేశాలకు హరీష్ రావు ఎందుకు వెళ్లలేదు ? 
 
కేంద్రం ప్రభుత్వం అయినా.. రాష్ట్ర ప్రభుత్వం అయినా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు అన్ని డిపార్ట్మెంట్లతో సమీక్ష సమావేశాలు పెట్టుకునే సాంప్రదాయం ఉంటుందని ఈటల గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శితో మీటింగ్ పెట్టుకుని గత ఏడాది బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు.. రాబోయే కాలానికి బడ్జెట్ కేటాయింపులు తయారు చేస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత  ఏ డిపార్ట్మెంట్లో కూడా ఆయా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకునే అవకాశం లేకుండా చేశారన్నారు.  ముఖ్యమంత్రి   స్వయంగా అధికారులను పిల్చుకొని బడ్జెట్ రాసి ఇచ్చుడు తప్ప ఎక్కడ కూడా సంపూర్ణమైన చర్చ బడ్జెట్ మీద డిపార్ట్మెంట్ల వారిగా జరిగే పరిస్థితి లేకుండా చేశారన్నారు. 


దేశంలోనే ద్రవ్యోల్బణం పెరుగుదలలో  తెలంగాణ నెంబర్ వన్ 


 కేంద్ర ప్రభుత్వం తన సంప్రదాయాల ప్రకారం అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులను పిలిస్తే మన రాష్ట్ర ఆర్థిక మంత్రి డుమ్మా కొట్టారని విమర్శించారు.  ఎంత నిర్లక్ష్యంగా, ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు అర్థం చేసుకోవాలని ఈటల రాజేందర్ ప్రజల్ని కోరారు.  ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల కమిట్మెంట్ లేదు, విశ్వాసం లేదు అనటానికి ఇది సజీవ సాక్ష్యమన్నారు.  గణాంకాల శాఖ దేశంలో ధరల పెరుగుదల మీద సర్వే చేస్తే మన రాష్ట్రంలో 8.75% ద్రవ్యోల్బణం పెరిగింది అని రిపోర్ట్ ఇచ్చారు. దేశంలో నెంబర్ వన్ తెలంగాణ అని చెప్పే ముఖ్యమంత్రి గారు ధరల పెరుగుదలలో, ప్రజలనడ్డి విరవడంలో నెంబర్ వన్ తెలంగాణ వచ్చింది అంటే సిగ్గుతో తలదించుకోవాలన్నారు.