Ganta likely to Join YSRCP - విజయవాడ: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ వైఎస్ఆర్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావు సన్నిహితులు ఇప్పటికే ఆ మేరకు లీకులు ఇస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో వైజాగ్ పర్యటన కు వస్తున్న సీయం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరుతారని చెబుతున్నారు. డిసెంబర్ 1 న గంటా ఫుట్టిన రోజు సందర్భంగా ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే చాన్స్ ఉందని అంటున్నారు. 2019 లో టీడీపీ నుండి ఎమ్మెల్యే గా గెలిచిన గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ను నిరసిస్తూ ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ కు అందించగా అది ప్రస్తుతం పెండింగ్ లో ఉంది.
గత మూడున్నరేళ్లుగా టీడీపీకి దూరంగా ఉంటున్న గంటా
ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. టీడీపీ పార్టీ ఓడిపోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పార్టీ అధినేత చంద్రబాబు విశాఖ కు వచ్చిన సందర్భాల్లోనూ గంటా పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేదు. అదే సమయంలో గంటా ను పార్టీలోనే అట్టి పెట్టుకునే ప్రయత్నాలు చేసింది తెలుగుదేశం అధిష్టానం. స్వయంగా అధినేత చంద్రబాబు హైదరాబాద్ లో గంటా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి మరీ ఆయన కుటుంబ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత కూడా గంటా శ్రీనివాసరావు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొనలేదు.కేవలం అయ్యన్న పాత్రుడు అరెస్ట్ విషయంలో మాత్రమే సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసారు. అయితే.. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ లో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్టు ఆయన క్యాంప్ సంకేతాలు ఇస్తోంది.
బీజేపీ, జనసేనల్లోకి వెళ్తారని మొదట్లో ప్రచారం - ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ వైపు చూపు
మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ కు అత్యంత సన్నిహితుడైన గంటా శ్రీనివాసరావు ప్రజారాజ్యం పార్టీలో కీలక నేత గా వ్యవహరించారు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యాక మంత్రి పదవి సైతం పొందారు.రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరి అక్కడా మంత్రి పదవిని పొందారు.2019 ఎన్నికల్లో జగన్ హవా లో సైతం ఎమ్మెల్యే గా గెలిచిన గంటా శ్రీనివాసరావు ఆ తర్వాత టీడీపీ లో యాక్టివ్ గా ఉండడం తగ్గించారు. మధ్యలో చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన లో చేరుతారనే గట్టి ప్రచారమే జరిగింది. అయినప్పటికీ అటు గంటా..ఇటు పవన్ ఇద్దరూ ఆ విషయంలో మౌనంగానే ఉంటూ వచ్చారు. ఇక 2024 ఎన్నికలకు రంగం సిద్దమవుతున్న నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు చూపు వైఎస్ఆర్‌సిపీ వైపు మళ్లింది అంటున్నారు అయాన సన్నిహితులు.
గతంలో చేరిక ప్రయత్నాలను ఇతర వైఎస్ఆర్‌సీపీ నేతలు అడ్డుకున్నారని ప్రచారం
నిజానికి గంటా శ్రీనివాసరావు ఏడాది ముందే వైఎస్ఆర్‌సిపీ వైపు వెళ్లే ప్రయత్నం చేశారని అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు అనే ప్రచారం ఉంది. అప్పట్లో మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు, ఇంచార్జి గా ఉన్న విజయ సాయి రెడ్డి లు గంటా చేరికను తీవ్రంగా వ్యతిరేకించారు . అయినప్పటికీ కొన్ని సార్లు ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరబోతున్నారన్న ప్రచారం జరిగింది.
అయితే ప్రస్తుతం మారిన పరిణామాల దృష్ట్యా గంటాకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది.