గత రెండు మూడు రోజులుగా వైసీపీలో జరుగుతున్న మార్పులతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. వైసీపీ నేతల్లో మాత్రంఉత్కంఠతను రేపుతున్నాయి. కీలక నేతలతోపాటు నమ్మిన బంట్లకి కూడా పక్కన పెట్టారు జగన్. పార్టీ జిల్లా అధ్యక్ష, రీజనల్‌ కో ఆర్డినేటర్ల పదవులు విషయంలో జగన్‌ తీసుకున్న నిర్ణయాలు ఇంకా ఆపార్టీ శ్రేణులను షాక్‌లోనే ఉంచాయి. ఇప్పుడు దీనికి మరింత హీటు పెంచేలా 9మంది నేతలను తాడేపల్లి పార్టీ ఆఫీసుకి రమ్మనడం కూడా చర్చనీయాంశంగా మారింది. 


పనితీరు ఆధారంగా వచ్చే ఎన్నికల్లో సీట్లు ఉంటాయని ఇప్పటికే చెప్పిన జగన్‌ వారసుల విషయంలో నిన్నటి వరకు కఠినంగానే వ్యవహరించారు. సీనియర్లు, పని చేసే వారికే టిక్కెట్లు ఉంటాయని స్పష్టం చేాశారు. అయితే పరిస్థితులు ఇతర కారణాలతో వైసీపీ అధినేత ఇప్పుడు కాస్తంత మెత్తబడి మెట్టుదిగారట. వారసులను వచ్చే ఎన్నికల్లో దింపాలనుకుంటున్న కొందరి సీనియర్ల కోరికకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూనే షరతులు వర్తిస్తాయని గట్టిగానే చెప్పారట. అలా జగన్‌ షరతులతో ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ నలుగురు వారసులు ఎవరన్నదానిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. 


చిత్తూరు జిల్లాలో భూమన, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తమ కుమారులను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమంలో వారసులను దింపి జగన్‌ దృష్టిలో పడేలా చేసుకున్నారు. జగన్‌ కూడా వీళ్ల పనితీరుపై కాస్తంత సంతృప్తితోనే ఉన్నారని టాక్. రానున్న ఎన్నికల్లో తిరుపతి నుంచి భూమన కొడుకు అభినయ్‌, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి కుమారుడు మోహిత్‌ పోటీ చేయనున్నారన్న వార్తలు హడావుడి చేస్తున్నాయి. 


భూమనకు పల్నాడు జిల్లా బాధ్యతలను, చెవిరెడ్డికి పార్టీ అనుబంధ విభాగాల సమన్వయకర్తగా నియమించడంతో పార్టీ సేవలకు ఇక వారు పరిమితం కానున్నారని సమాచారం. అనారోగ్యంతో ఉన్న మంత్రి విశ్వరూప్‌ కోరిక మేరకు ఆయన వారసుల్లో ఒకరికి ఛాన్స్‌ ఇవ్వడానికి జగన్‌ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి ఇంట టిక్కట్ల గోల నడుస్తోంది. కొడుకులిద్దరినీ పోటీలోకి దింపాలని మంత్రి కుటుంబం భావిస్తోందట. ఇంటికి ఒకరికే అవకాశం ఇస్తానని జగన్‌ స్పష్టం చేయడంతో విశ్వరూప్‌ కొడుకల్లో ఎవరికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. 


ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కూడా తన వారసుడికి టిక్కెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల రీత్యా తన కొడుక్కి ఛాన్స్‌ ఇవ్వాలని కోరడంతో రానున్న ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి జగన్మోహన రెడ్డి పోటీలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే కొడుక్కి ఇవ్వమని చెన్నకేశవరెడ్డి కోరినా జగన్‌ మాత్రం సీనియార్టికే పెద్ద పీట వేశారు. అయితే ఇప్పుడు మాత్రం వారసుడికే ఇచ్చేందుకు జగన్‌ అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పేర్ని నాని, కొడాలి నాని కూడా తమ వారసులను రంగంలోకి దింపాలనుకుంటున్నా జగన్‌ మాత్రం ఆసక్తిచూపించడం లేదు. ఇప్పుడు ఈ నలుగురికి కూడా పలు కారణాలను దృష్టిలో ఉంచుకొనే వారసులకు అవకాశం ఇస్తున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.