Telangana Politics :  బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ మరోసారి సమావేశమయ్యారు.  హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్ హౌస్ లో వీరి భేటీ నడుస్తోంది. ఈ సందర్భంగా వీరి గన్ మెన్లు, వ్యక్తిగత సిబ్బంది కూడా లేకపోవడం గమనార్హం. ఇటీవలే ఖమ్మంలోని పొంగులేటి నివాసానికి వెళ్లిన బీజేపీ నేతలు పొంగులేటి, జూపల్లితో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరు మరోసారి భేటీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల ఈటల రాజేందర్ చేరికల కమిటీ సభ్యులతో కలిసి ఖమ్మం వెళ్లి పొంగులేటి, జూపల్లిలతో సమావేశం అయ్యారు. అయితే వారిద్దరూ ఏ నిర్ణయమూ చెప్పలేదు. ఈ లోపు కర్ణాటక ఎన్నికలు వచ్చాయి. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ పరాజయం కావడం.. కాంగ్రెస్ విజయం సాధించడంతో వారిద్దరూ బీజేపీలో చేరికపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈటల మాత్రం వారిని పార్టీలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.               


పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానించాలని బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ చేరాలని దిల్లీ నుంచి రాహుల్ గాంధీ టీమ్ వచ్చి పొంగులేటితో ఈ మధ్య చర్చలు కూడా జరిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లలో రెండు తప్ప మిగిలిన ఎనిమిది సీట్లు పొంగులేటి సూచించిన అభ్యర్థులకు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ప్రచారం కూడా జరిగింది. ఇంతకు ముందే  బీజేపీ చేరికల కమిటీ, ఈటల రాజేందర్ నేతృత్వంలో ఓ బృందం పొంగులేటి, జూపల్లితో చర్చలు జరిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పది సీట్లు ఆయనకే ఇస్తామని ఆఫర్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ హైకమాండ్ నుంచి స్పష్టత రాకపోయేసరికి ఇద్దరు నేతలు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. అందుకే ఢిల్లీ వెళ్లి ఈటల రాజేందర్ చర్చలు  జరిపి వచ్చిన తర్వాత మరోసారి వారిద్దరితో రహస్య భేటీ నిర్వహించినట్లుగా చెబుతున్నారు.                                      


పొంగులేటితో పాటు  జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తనతో పాటు తన సన్నిహితులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ నుంచి జూపల్లికి ఒత్తిడి వస్తోంది. కేసీఆర్ను ఓడించాలన్న లక్ష్యం కాంగ్రెస్లో చేరితేనే నెరవేరుతుందని, ఈ టైంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హస్తం నేతలు సూచిస్తున్నారు.   వీళ్లద్దరు ఏ పార్టీలో చేరితే రానున్న రోజుల్లో ఆ పార్టీలోకే మిగతా నేతల వలసలు ఉంటాయనే అంచనాలు ఉన్నాయి.   జాతీయ పార్టీలు రెండూ ఈ ఇద్దరు నేతలకు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూంటే.. బీఆర్ఎస్.. వీరికి కనీసం టిక్కెట్లు ఎందుకు కేటాయించడానికి సిద్దపడలేదన్నది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గామారింది.                                      


వీరిద్దరూ త్వరలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అక్టోబర్‌లో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున వీరు త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు.