Elections In Singareni: సింగరేణి కాలరీస్ సంస్థలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను వచ్చే నెల 28వ తేదీన నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే ఎన్నికల అధికారి, కేంద్రకార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డి. శ్రీనివాసులు బుధవారం రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. అయితే ఒకో రోజు ఎన్నికలు, అదే రోజు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. అలాగే ఈనెల 30వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను కార్మిక సంఘాలకు, యాజమాన్యానికి ఇవ్వనున్నారు. వీటిపై వచ్చే నెల 3వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించబోతున్నారు. 5వ తేదీన ఓటర్ల తుది జాబితాను వెల్లడిస్తారు. అలాగే వచ్చే నెల 6వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అలాగే 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అర్హులైన అభ్యర్థులకు 10వ తేదీ మధ్యాహ్నం ఎన్నికల గుర్తులను కేటాయిస్తారు. 28వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుండగా.. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేస్తారు. ఆ తర్వాత అంటే వెంటనే ఫలితాలను వెల్లడిస్తారు. 


సింగరేణిలో 42 వేలకుపైగా ఓటర్లు


మరోవైపు సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూలు విడుదల అయినప్పటికీ ఎన్నికల నిర్వహణపై అందరిలోనూ అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే వచ్చే నెల మొదటి వారంలో శాసన సభ ఎన్నికల నోటిఫికేష్ ను వెలువడుతుంది. ఈక్రమంలోనే జిల్లా అధికారులతో పాటు కలెక్టర్లు, ఎస్పీలు ఫుల్లు బిజీ అయిపోతారు. 42 వేలకు పైగా ఓటర్లు ఉన్న సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలంటే భారీ బందోబస్తు కావాల్సిందే. అలాగే ప్రభుత్వ అధికారుల సేవలు కూడా తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్పీలు, జిల్లా కలెక్టర్లు సింగరేణి ఎన్నికల నిర్వహణలో పాల్గొనే అవకాశం ఉంటదు మరోవైపు కార్మిక సంఘాల్లో ఎక్కువ శాతం ఎన్నికలను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. 


లిఖిత పూర్వకంగా లేఖ రాసిన 13 యూనియన్లు


రాష్ట్రంలో జరగబోయే శాసనసభ ఎన్నికల తర్వాత సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సంస్థలోని 13 యూనియన్లు లిఖిత పూర్వకంగా ఎన్నికల అధికారి శ్రీనివాసులును కోరారు. అలాగే గెలిచిన సంఘం కాల పరిమితి, గత ఒప్పందాల అమలు తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాట్లు లేఖలో వివరించారు. వీటితో పాటు ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో మరో కేసు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సింగరేణిలో దాదాపు  20 సంవత్సరాల తర్వాత జాతీయ స్థాయి రెస్క్యూ పోటీలు వచ్చే నెలలో జరగబోతున్నాయి. ఇందుకోసం దేశ వ్యాప్తంగా 20కి పైగా మైనింగ్‌ సంస్థల బృందాలు ఇక్కడి రానున్నాయి. అలాగే 54వ రక్షణ వారోత్సవాలకు కూడా సింగరేణి సంస్థ సన్నద్ధం అవుతోంది. వీటిన్నిటినీ పరిగణనలోకి తీసుకోకుండానే ఎన్నికల షెడ్యూలు విడుదల చేశారని పలు సంఘాలు చెబుతున్నాయి. చూడాలి మరి ఏం జరగనుందో. 


Read Also: Singareni Employees: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త, 32 శాతం బోనస్ ఇవ్వబోతున్నట్లు ప్రకటన