Telangana Elections 2023: అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్లు దాఖలు చేసే సమయం ముగిసింది. ఆఖరిరోజైన ఈ రోజు కూడా కొంత మంది అభ్యర్థుల విషయంలో పార్టీలు ట్విస్ట్ లు ఇచ్చాయి. ముందుగా టికెట్ ఇచ్చిన వారికి ఆఖరి నిమిషం వరకూ బీ ఫాం ఇవ్వకుండా ఆఖర్లో ఏకంగా అభ్యర్థినే మార్చేశాయి. బీజేపీ సంగారెడ్డి, వేములవాడ అభ్యర్థులను మార్చేసింది. 


సంగారెడ్డి బీజేపీ అభ్యర్థి మార్పు
ముందుగా దేశ్ పాండే రాజేశ్వరరావును బీజేపీ అభ్యర్థిగా ప్రకటించి పులిమామిడి రాజుకు బీజేపీ బీ ఫాం ఇచ్చింది. దీంతో దేశ్ పాండే రాజేశ్వరరావు విపరీతంగా ఫీల్ అయ్యారు. దు:ఖం, ఆవేదన ఆపుకోలేకపోయిన ఆయన ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డికి ఫోన్ చేసి వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఫోన్లోనే వెక్కి వెక్కి ఏడుస్తూ.. తనకు బీ ఫామ్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రాజేశ్వరరావు కిషన్ రెడ్డిని హెచ్చరించారు. 


‘‘నువ్వు రాష్ట్ర అధ్యక్షుడివి కదా నీ పేరు చెప్పి నేను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటా. నీ పేరు మీద సచ్చిపోతా. నువ్వు నన్ను మోసం చేసినవ్. నన్నెందుకు పిలిచినవ్. ఆఫీస్ కి బీ ఫాం పంపిస్తున్నా. నామినేషన్ వేసుకో అని ఎందుకు చెప్పిన్రు. నేను పార్టీకి ఏం అన్యాయం చేసిన. నేను పార్టీకి ఏం అన్యాయం చేసినా అన్నా. నా ఇజ్జత్ తీసినవ్ అన్నా నువ్వు. నువ్వు నాకు బీ ఫాం ఇయ్యకపోతే సచ్చిపోతా. నేను ఏం అన్యాయం చేసిన అన్నా’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటికి నామినేషన్ వేసేందుకు ఇంకొంత సమయం ఉండటంతో దేశ్‌పాండే రాజేశ్వరరావు రిటర్నింగ్ కార్యాలయం ముందు నిరసకు దిగారు. తర్వాత కాసేపటికి వెళ్లిపోయారు.


వేములవాడలో తుల ఉమ కంటతడి


ఆఖరి నిమిషంలో వేములవాడ అసెంబ్లీ టికెట్‌ను కూడా బీజేపీ మార్చేసింది. తొలుత వేములవాడ బీజేపీ అభ్యర్థి పేరు తుల ఉమ ఉండగా చివరి నిమిషంలో మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు కుమారుడు వికాస్‌ రావును బీజేపీ ప్రకటించింది. దీంతో తుల ఉమ కంటతడి పెట్టారు. బీసీ మహిళలకు పార్టీలో గౌరవం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వేములవాడ బరిలో తాను కచ్చితంగా ఉంటానని.. బీజేపీ బీసీ, మహిళా నినాదం అంతా బోగస్‌ అని పార్టీని విమర్శించారు. అభ్యర్థిని మార్చినట్లు కనీసం సమాచారం కూడా తనకు ఇవ్వలేదని వాపోయారు. 


కాంగ్రెస్ కూడా ఇదే ట్విస్ట్
ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా ఆఖరి నిమిషంలో ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి. సూర్యాపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన పటేల్‌ రమేశ్‌ రెడ్డికి నిరాశ ఎదురైంది. అక్కడ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్ఠానం టికెట్‌ ఖరారు చేసింది. టికెట్ దక్కనందుకు గానూ పటేల్ రమేశ్‌ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఏడ్చారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే తమను అన్యాయం చేశారని బోరున ఏడ్చారు. మరోవైపు పటేల్‌ రమేశ్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నారు. సూర్యాపేటలోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేయనున్నారు.