Telangana Election 2023:  తెలంగాణలో ఎన్నికలు ఇంకొద్ది రోజులే ఉన్నందున ముఖ్యమైన తాయిలాల్లో ఒకటైన మద్యం పంపకాలపై ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది. తాజాగా ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ ప్రకారం తెలంగాణలోని 18 మద్యం డిస్టిలరీలపై నిఘా పెట్టినట్లుగా ఎక్సైజ్‌ శాఖ జాయింట్ కమిషనర్ సురేశ్ తెలిపారు. ఇందుకోసం మొత్తం 10 టీమ్ లను ఏర్పాటు చేసి.. ఒక్కో టీమ్ కి ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ను ఇన్‌ఛార్జిగా నియమించినట్లు సురేశ్ తెలిపారు. 


రాష్ట్రంలోని 18 డిస్టిలరీలను అధికారుల టీమ్స్ ఆకస్మికంగా తనిఖీ చేశాయని, లిక్కర్ ఉత్పత్తి, సప్లై, సంబంధింత రిజిస్టర్లను పరిశీలించినట్లు చెప్పారు. రికార్డులన్నీ సక్రమంగాగానే ఉన్నాయని, అధికారుల పరిశీలనలో తేలిందని సురేశ్ వెల్లడించారు. మద్యం డిస్టిలరీల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని ఎక్సైజ్‌ శాఖ హెడ్ ఆఫీస్ కు కనెక్ట్ చేసినట్లుగా ఆయన వెల్లడించారు. నిరంతరం సీసీటీవీ కెమెరాలను పరిశీలించడం సహా.. మద్యం అక్రమ రవాణా జరగకుండా నిఘా పెట్టినట్లుగా జాయింట్ కమిషనర్ సురేశ్ వెల్లడించారు.


ఇప్పటిదాకా భారీ నగదు సీజ్
మరోవైపు, ఎన్నికల ప్రవర్తన నియమావళిలో (Election Code) భాగంగా ఇప్పటి వరకు రూ.53,18,37,638 విలువ గల నగదు సీజ్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా ఎఫ్.ఎస్.టి, పోలీస్, ఎక్సైజ్, ఎస్.ఎస్.టి అధికారులు ఏర్పాటు చేసిన 18 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ల వద్ద ఈ మొత్తం విలువ గల నగదు, బంగారం తదితర సామాగ్రిని సీజ్ చేశారు. ఇందులో రూ.21,82,79,365 నగదు ఉండగా ఇతర విలువైన వస్తువులు 31,35,58,273 విలువగలవి ఉన్నాయి. ఇందులో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ల ద్వారా రూ.3,57,32,450 నగదు, ఇతర సామాగ్రిని సీజ్ చేశారు. 


ఎస్.ఎస్.టీ టీమ్ ల ద్వారా రూ.14,52,000 నగదు, ఇతర సామాగ్రిని సీజ్ చేశారు. పోలీస్ అధికారుల ద్వారా రూ.49,46,53,188 విలువైన నగదు, ఇతర సామాగ్రిని సీజ్ చేశారు. పోలీస్, ఎక్సైజ్ శాఖ లు సంయుక్తంగా రూ.3,56,34,955 విలువ గల 64,964 లీటర్ల లిక్కర్ ను సీజ్ 711 కేసులు బుక్ చేసి 502 మందిని అరెస్ట్ చేశారు. 23,28,16,464 రూపాయల విలువ గల 447 కేజీల మెటల్స్ బంగారం, సిల్వర్ ఇతర వస్తువులను సీజ్ చేశారు. ఎన్.డి.పి.ఎస్ కింద 3,29,92,521 రూపాయల విలువ గల 1262 కిలోల గంజాయి, డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఉచితాల కింద 55,24,754 రూపాయల విలువ గల జాఫ్రాన్ -15, ల్యాప్ టాప్ లు -14, పి.డి.ఎస్ రైస్ 428.520, శారీస్, కుర్తాలు -1878, సెల్ ఫోన్లు- 380, మిక్సర్, గ్రైండర్, 72 గ్యాస్ స్టవ్ లను సీజ్ చేశారు. 


పోలీస్ శాఖ ద్వారా రూ.19,89,847 విలువైన 13,611 లీటర్ల లిక్కర్ ను సీజ్ చేసి 319 కేసులను బుక్ చేసి 277 మందిని అరెస్ట్ చేశారు. ఎంసీసీ ఉల్లంఘన కింద 69 కేసులను బుక్ చేసి 10 ఎఫ్.ఐ.ఆర్ లు, 241 పోలీస్ ప్రొహిబీషన్ కేసులను నమోదు చేశారు. ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.3,36,62,808 విలువ గల 51,433 లీటర్ల లిక్కర్ ను సీజ్ చేశారు. రూ.56,30,509 విలువైన 231 కేజీల గంజాయిని సీజ్ చేసి 389 ప్రొహిబీషన్ కేసులు నమోదు చేసి 219 మందిని అరెస్ట్ చేశారు.