Telangana Rains | అమరావతి/ హైదరాబాద్: ఎల్‌నినో కారణంగా పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయని, ఇది నైరుతి రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో తూర్పు, ఈశాన్య భారతదేశంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వారం రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలతో పాటు తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయిన వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది భారత్‌లో పలు రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతోంది. వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగానే పలు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం కనిపిస్తోంది.
ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచన
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) శుక్రవారం రాష్ట్రంలో కురిసే వర్షాలపై అప్డేడ్ ఇచ్చింది. నేడు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు (పోలవరం ప్రాంతం), కాకినాడ, ఎన్టీఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు, ముఖ్యంగా రైతులు పిడుగులు పడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో ఒక్కసారిగా మారనున్న వాతావరణం
తెలంగాణలో వాతావరణం అకస్మాత్తుగా మారనుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. జూలై 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ కేంద్రం సూచించింది. రాబోయే రోజుల్లో ఉరుములు, మెరుపుల ప్రభావం క్రమంగా తగ్గిపోనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.
Also Read: KTR Revanth Globarena: గ్లోబరీనా వివాదం - రేవంత్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు.. తీవ్ర వ్యాఖ్యలు!
పలు జిల్లాల్లో మలమైన ఈదురు గాలులు
వరంగల్, మహబూబాబాద్‌తో పాటు ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ గ్రీన్ అలెర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఎలాంటి తీవ్రమైన వాతావరణ ముప్పు లేదని, కొన్ని చోట్ల మాత్రం గాలుల ప్రభావం స్వల్పంగా కనిపించే అవకాశం ఉందని తెలిపింది. పెద్దగా వర్షాల ముప్పు లేకపోయినప్పటికీ, ఉత్తరాన ఆదిలాబాద్ నుంచి దక్షిణాన జోగులాంబ గద్వాల వరకు అన్ని జిల్లాల్లోనూ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. రెండేళ్ల కిందట భారీ వర్షాలతో ఖమ్మం, కామారెడ్డిలో భారీ వరదలు సంభవించి ప్రాణ నష్టం జరగడం తెలిసిందే.
బలమైన ఈదురుగాలుల ప్రభావం వల్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆరుబయట ఉండేవారు, చెరువులు, కుంటలు, జలాశయాల సమీపంలో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రయాణాల్లో గాలుల ఉధృతికి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. వర్షాల సమయంలో రైతులు, కార్మికులు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
