Eetela Rajender on KCR: సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో సీఎం కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రానికి బంధం తెగిపోయిందని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే అని చెప్పుకొచ్చారు. భరోసా యాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని తెలిపారు. నల్గొండ నియోజకవర్గంలో ప్రజాగోస - బీజేపీ భరోసా యాత్రలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ, ఏపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. ఈ సెంటిమెంట్ తో రాష్ట్ర ప్రజల్ని కేసీఆర్ మోసం చేయలేరని అన్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కామెంట్స్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. తెలంగాణలో దోపిడీ సరిపోదు అన్నట్టుగా.. దిల్లీకి పోయి లిక్కర్ వ్యాపారం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలని నిలదీశారు. ఇక్కడ సరిపోతలేదా? అంటూ విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజల సొమ్ము ధారాదత్తం "తెలంగాణలో ధరణి పేరిట వేలాది ఎకరాల భూములను కబ్జాచేసి, పేదల భూములను మాయం చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించారు. మాలాంటి వారిని ఓటగొట్టడానికి ఆ డబ్బులు ఖర్చు చేయడం వాస్తవం కాదా?.
"తెలంగాణ ప్రజలారా 2014 వరకు అటుకులు బుక్కి, ఉపాసముండి ఉద్యమాలు నడిపిన పార్టీ మాది అని కేసీఆర్ చెప్పేవారు. ఉద్యమ సమయంలో ఉపఎన్నికల్లో తీసుకునే దిక్కు తీసుకోండి వేసుకునే దిక్కు వేసుకోండి అనీ చెప్పిన కేసీఆర్.. 2014 తర్వాత వేల కోట్ల రూపాయలు ఉపఎన్నికలలో ఖర్చుపెట్టి, ఓట్లను కొనుక్కునే స్థాయికి ఎలా వచ్చారు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పార్టీకి కూడా సొంత హెలికాప్టర్లు, విమానాలు లేవు. విమానాలు కొంటున్నామని చెప్పిన వ్యక్తి ఎవరు? హెలికాప్టర్లు పెట్టుకొని తిరుగుతా అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు తాత జాగీర్ లాగా ఇక్కడ నుంచి వేలకోట్ల రూపాయలు పంపించి తెలంగాణ ప్రజల సొమ్మును ధారాదత్తం చేస్తుంది ఎవరు? తన పార్టీ అకౌంట్లో అతి తక్కువ కాలంలోనే 870 కోట్ల రూపాయల వైట్ మనీ ఉందని చెప్పింది కేసీఆర్ కాదా? ఉపాసం ఉన్న పార్టీ..అటుకుల బుక్కిన పార్టీకి 8 సంవత్సరాల కాలంలోనే వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో తెలంగాణ ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఎవరికైనా డబ్బులు ఊరికినే ఇస్తారా?" - ఈటల రాజేందర్
కేసీఆర్ కుటుంబం దిల్లీ మీద పడింది..
దిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందో లేదో దర్యాప్తు సంస్థలే తేలుస్తాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్య 13వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ గన్‌పార్క్‌లోని అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై స్పందించారు. తెలంగాణ చాలదన్నట్లు దోచుకోవటానికి కేసీఆర్ కుటుంబం దిల్లీ మీద పడిందని విమర్శించారు. టీఆర్ఎస్ ను మట్టి కరిపించే శక్తి బీజేపీకి మాత్రమే ఉందన్నారు. కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.