Telangana ED Raids : తెలంగాణలోని పది ప్రైవేటు మెడికల్ కాలేజీలు నలభై ఐదు సీట్లు బ్లాక్ చేసి ఒక్కో సీటును కోట్లకు అమ్ముకున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. మెడికల్ కాలేజీలపై ఇలాంటి ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే ఈడీ ఇప్పుడు సోదాలు ప్రారంభించడంతో మరోసారి చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణలో మొత్తం పది మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారులు ఒకే సారి సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు 15 ప్రాంతాల్లో 11 బృందాలుగా విడిపోయి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కామినేని , ఎస్వీఎస్ , ప్రతిమ , మమతా మెడికల్ కాలేజీల్లోనూ సోదాలు చేస్తున్నారు.
మెడికల్ కాలేజీల యాజమాన్యాల ఇళ్లలోనూ సోదాలు
మొత్తం పది మెడికల్ కాలేజీల యాజమాన్యాల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ, మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ, ప్రతిమా కార్పొరేట్ కార్యాలయాల్లో జరుగుతున్నాయి ప్రతిమా గ్రూప్‌కి చెందిన ఆర్థిక లావాదేవీలను కూడా బయటకు తీస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు మహబూబ్‌నగర్ ,నల్లగొండ , రంగారెడ్డి ,మేడ్చల్ జిల్లాల్లో ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి. ముంబైలో BMC కేంద్రంగా జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా ఈడి సోదాలు నిర్వహిస్తోంది. కోవిడ్ సమయంలో హైదరాబాద్ హాస్పిటల్స్ నుండి ముంబై BMC కు మెడికల్ కిట్స్ సప్లై అయిన క్రమంలో జరిగిన అక్రమాలు ఈ సోదాలకు కారణంగా తెలుస్తోంది.
సీట్లు బ్లాక్ చేసి కోట్లకు అమ్ముకున్నారా ?
భారీగా నిధులు మళ్లింపు జరిగినట్టు ఈడి అభియోగంతో ఈ దాడులు జరుగుతున్నాయి. మెడికల్ కాలేజీల్లో భారీగ అవకతవకలు జరిగాయని మరి ముఖ్యంగా ఫీజుల వసూళ్ల విషయంలో అక్రమాలు జరిగాయని తెలుస్తోంది. హైదరాబాద్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన సంస్థలు రూ.12వేల కోట్ల స్కామ్ లో ఇరుక్కున్నట్లుగా తెలుస్తోంది. కొన్నాళ్ల కిందట ఐటీ అధికారులు తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో మెడికల్ సీట్ల కోసం అనధికారికంగా పెద్ద ఎత్తున నగదు తీసుకున్నారని.. వాటిపై దర్యాప్తు చేయాలని ఈడీకి ఐటీ అధికారులు లేఖ రాశారు. కానీ ఇప్పటి వరకూ ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
సుదీర్ఘంగా సోదాలు చేసే అవకాశం
ఐటీ అధికారులు రాసిన లేఖల ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారా లేకపోతే.. ముంపై బీఎంసీ స్కామ్ ఆధారాంగా అన్నది తెలియాల్సి ఉంది. మెడికల్ కాలేజీలకు సంబంధించిన వ్యవహారం కావడంతో.. సుదీర్ఘంగా సోదాలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.