Kavitha ED Notice : భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం విచారణకు  హాజరు కావాలని ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్ గా మారి ఈడీకి స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ ఆరుణ్ రామచంద్ర పిళ్లైను కవిత బినామీగా ఈడీ చెబుతోంది. గతంలో కవితను ఢిల్లీలో పలుమార్లు విచారించారు. సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. 


ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక మలుపులు తిరుగుతోంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు అప్రూవర్లుగా మారారు.  ముఖ్యంగా సౌత్ లాబీలో సీబీఐ, ఈడీ గుర్తించిన నిందితుల్లో ఒక్క కల్వకుంట్ల కవిత తప్ప దాదాపుగా అందరూ అప్రూవర్లు అయ్యారు. అంటే.. ఒక్క కవిత మాత్రమే నిందితురాలిగా మిగిలారు.  అరుణ్ రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్ గా మారారు.   ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. ఈయన కవిత తరపున బినామీగా వ్యవహరంచారని ఈడీ చెబుతోంది. ఆయన కూడా  గతంలో తాను కవిత బినామీనేనని అంగీకరంచారు. తర్వాత తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానన్నారు. మళ్లీ ఇప్పుడు పూర్తిగా మనసు మార్చుకుని అప్రూవర్ గా మారారు. కవిత మద్యం బినామీ వ్యాపారం మొత్తం పిళ్లై పేరు మీదుగా సాగిందని ఈడీ, సీబీఐ చెబుతున్నాయి. ఇప్పటికే  ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శరత్ చంద్రారెడ్డి కూడా అప్రూవర్లు అయ్యారు. వారిద్దరూ సౌత్ లాబీ నుంచి కీలకం. ఇక కవిత  ఆడిటర్ గా పని చేసిన బుచ్చిబాబు కూడా అప్రూవర్ అయ్యారని చెబుతున్నారు. ఆయన దగ్గర నుంచి ఇటీవల స్టేట్ మెంట్లు కూడా మళ్లీ తీసుకున్నారు. ఇక సౌత్ లాబీలో మిగిలింది కవిత మాత్రమే. ఇప్పుడు విచారణకు పిలవడంతో ఎలాంటి పరిణామాలు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. 
 
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో 2021, 2022లో రూపొందించిన ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జూలైలో సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. గతేడాది నవంబర్ 17న అమలులోకి వచ్చిన ఈ విధానంలో భాగంగా నగరాన్ని 32 జోన్‌లుగా విభజించి 849 షాపులకు సంబంధించి ప్రైవేట్ బిడ్డర్లకు రిటైల్ లైసెన్సులు ఇచ్చారు. ఈ విధానాన్ని బీజేపీ, కాంగ్రెస్‌లు వ్యతిరేకిస్తూ ఎల్‌జీకి ఫిర్యాదు చేశాయి. ఎల్‌జీ ఆదేశంతో మొదట సీబీఐ.. సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగాయి.  వరుసగా అరెస్టులు చేశాయి. అరబిందో శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్లైను బినామీగా పెట్టుకుని కవిత ఢిల్లీలో మద్యం వ్యాపారం చేసినట్లుగా గుర్తించి కేసులు నమోదు చేసింది. విచారణ జరిపి దాఖలు చేసిన చార్జిషీట్‌లో కవిత బినామీ ఆస్తుల వివరాలనూ వెల్లడించింది.  


ఢిల్లీలో మద్యం వ్యాపారంలో సాధించిన లాభాలతో హైదరాబాద్‌లో కవిత భూములు కొనుగోలు చేశారని, ఇందులో సౌత్‌గ్రూపుదే కీలకపాత్ర అని ఈడీ కోర్టుకు తెలిపింది.  భూముల కొనుగోలు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కుమార్‌ ప్రమేయం ఉందని తెలిపింది. గౌతమ్‌ మల్హోత్రా, అమన్‌దీప్, మాగుంట రాఘవ, అరుణ్‌ పిళ్లై వాంగ్మూలాల ఆధారంగా రెండు చార్జిషీట్లను దాఖలు చేసింది.  ఆప్‌ నేతలకు సౌత్‌గ్రూపు రూ.100 కోట్లు హవాలా రూపంలో ముడుపులిచ్చింది. తద్వారా మద్యం విధానం తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంది.  తర్వాత అందర్నీ అంటే కవిత తరపున వ్యవహారాలు చక్క బెట్టినట్లుగా  భావిస్తున్న అరుణ్ పిళ్లై, అభిషేక్ , బుచ్చిబాబు వంటి వారి వాంగ్మూలాలతో కవిత నేరం చేసినట్లుగా ఈడీ లెక్కలేసింది. వారందరూ దాదాపుగా అప్రూవర్లు అయ్యారు.