Granite Mining Case: గ్రానైట్ మైనింగ్ కేసులో ఈడీ విచారణను ముమ్మరం చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో బాధ్యులకు నోటీసులు జారీ చేసి వాంగ్మూలాల నమోదుకు సిద్ధం అవుతోంది. విదేశాలోల జూదానికి సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులను విచారిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సీనరేజీ ఎగ్గొట్టేందుకు.. ఎగుమతి చేసిన గ్రానైట్ ను తక్కువగా నమోదు చేశారని విజిలెన్స్-ఎన్ఫోర్స్ మెంట్ విభాగం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఎగుమతుల్లో పదో వంతును మాత్రమే రికార్డుల్లో చూపించారని వాటికి మాత్రమే సీనరేజి చెల్లించారని వివరించారు. ఇలా ఎగ్గొట్టిన సీనరేజీ రూ.124 కోట్లు ఉందని లెక్క తేల్చారు. ఇందుకు సంబంధించి ఆయా సంస్థలకు 5 రెట్లు జరిమానా కూడా విధించారు. 


రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..


సీనరేజీ వసూలు రాష్ట్ర పరిధిలోని అంశం కావడం వల్ల 2016లో రాష్ట్ర సర్కారు ఈ జరిమానాను రద్దు చేసింది. అయితే అనధికారికంగా చేసిన గ్రానైట్ కు సంబంధించిన విదేశీ చెల్లింపులు హవాలా మార్గంలో జరిగాయని, ఇవన్నీ విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం అయిన ఫెమా పరిధిలోకి వస్తుందంటూ ఈడీ రంగంలోకి దిగింది. ఇటీవల కరీంనగర్ కు చెందిన 8 గ్రానైట్ సంస్థల్లో సోదాలు నిర్వహించింది. ఇందులో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కు చెందిన శ్వేత గ్రానైట్స్, శ్వేత ఎజెన్సీస్ కూడా ఉన్నాయి. దాదాపుగా దశాబ్ద కాలం కిందట కరీంనగర్ కు చెందిన గ్రానైట్ కంపెనీలు అక్రమంగా విదేశాలకు పెద్ద ఎత్తున బ్లాక్ లను తరలించి పన్ను ఎగవేతకు పాల్పడ్డాయని వచ్చిన ఫిర్యాదులను బేస్ చేసుకుని అటు సీబీఐ, ఇటు ఈడీ, ఐటీ అధికారులు ఏక కాలంలో దాడులు జరపడం పెను సంచలనానికి కారణమైంది. జిల్లాకి చెందిన కీలక నేత మంత్రి గంగుల కమలాకర్ కంపెనీలో సోదాలతోపాటు... ఏకంగా ఆయన ఇంటి తాళం పగల కొట్టి మరీ అధికారులు సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. మరోవైపు హుటాహుటిన దుబాయ్ పర్యటనను విరమించుకొని వచ్చిన గంగుల కమలాకర్ దర్యాప్తుకు సహకరిస్తారని పేర్కొన్నారు. 


8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులు..


క్వారీ నిర్వాహకులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు వచ్చినందున వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. ఇక, గతంలో 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తక్కువ పరిమాణం చూపి విదేశాలకు ఎక్కువ ఎగుమతులు చేయడంపై ఈడీ ఆరా తీస్తోంది. గ్రానైట్ అక్రమాలు జరిగాయని, అనధికారిక ఎగుమతులకు సంబంధించిన చెల్లింపుల కోసం ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తుల పేర్లతో బినామీ ఖాతాలు తెరిచారని, విదేశాల నుంచి ఆయా ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బు జమ అయినట్లు ఈడీ సోదాల్లో బయటపడింది. పదేళ్ల కాలంగా జరుగుతున్న ఇలాంటి అక్రమాలకు సంబంధించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని ఈడీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను ఈడీ అధికారులు విశ్లేషిస్తున్నారు. తదుపరి దర్యాప్తలో భాగంగా బాధ్యులను విచారించి, వారందరికీ నోటీసులు జారీ చేయనున్నారని సనాచారం. గ్రానైట్ దిగుమతి చేసుకున్న విదేశీ సంస్థల వివరాలనూ ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.