Telangana News :  టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కోర్టును ఆశ్రయించింది.   సిట్ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదని నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే కేసు సమాచారం ఇవ్వాలని సిట్‌ను ఈడీ కోరింది. ESIR నమోదు చేసిన తరువాత కేసులో ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి పెట్టింది. కేసులో ప్రధాన నిందితులు రాజశేఖర్, ప్రవీణ్‌ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. ఈడీ దర్యాప్తునకు సిట్ సహకరించక పోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సిట్ అధికారులు ఈడీ విచారణకు సహకరించకపోవడం వివాదాస్పదంఅయ్యే అవకాశం ఉంది.  


ఇప్పటికే ఈడీ కాన్ఫిడెన్షియల్ రూమ్  కస్టోడీయన్ శంకర్ లక్ష్మీ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సత్యనారాయణలను విచారించాలని నిర్ణయించింది.  టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో ఆర్థిక మూలలను వెతికే పనిలో ఈడీ ఉంది.  ప్రవీణ్, రాజశేఖర్ స్టేట్‌మెంట్స్ కోసం నాంపల్లి కోర్టులో ఈడీ కస్టడీ కోరనుంది. పబ్లిక్ డొమైన్ ద్వారా ఇప్పటికే వివరాలు సేకరించి, ECIR నమోదు చేసింది. భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయని ఈడీ గుర్తించింది. టీఎస్‌పీఎస్‌సీ నిందితుల వద్ద నుంచి సిట్ 7లక్షలు సేకరించింది. 40లక్షలు డబ్బులు చేతులు మారాయని గుర్తించింది.


శంకరలక్ష్మి కంప్యూటర్‌ నుంచే ప్రశ్నపత్రాలు లీక్‌ కావడంతో, ఆమె పాత్రపై ఈడీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో మొదటిసారిగా బేగంబజార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అసిస్టెంట్‌ సెక్రటరీ సత్యనారాయణపై కూడా ఈడీ దృష్టి పెట్టింది. బుధవారం, గురువారాల్లో శంకరలక్ష్మి, సత్యనారాయణను విడివిడిగా విచారించే అవకాశం ఉన్నది. సిట్‌ సేకరించిన వివరాలు, ఫోరెన్సిక్‌ నివేదికలు, ఈ కేసులో ఇతర విషయాలకు సంబంధించిన వివరాలను కూడా తమకు అప్పగించాలని ఈడీ లేఖ రాసింది.  గ్రూప్‌-1 పరీక్ష పత్రాన్ని ముందుగానే అందుకొని, విదేశాల నుంచి వచ్చి పరీక్ష రాయడం, లక్షల్లో డబ్బులు చేతులు మారాయనే అనుమానంతో ఈడీ ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో ఇప్పటి వరకు 17 మందిని సిట్‌ అరెస్టు చేసింది. ఇంకా అధికమొత్తంలో డబ్బులు చేతులు మారి ఉంటాయోమోనని ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.                                        


ఇప్పటికే ఈ అంశంపై   ఈడీ కార్యాలయానికి వెళ్లి  రేవంత్ రెడ్డి   ఫిర్యాదు  చేశారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని ఈడీ అధికారులకు  అందించారు.  పేపర్ లీక్ అంశంలో  డబ్బులు  చేతులు  మారాయన్నారు. మనీలాండరింగ్  జరిగిందని  రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై  కేసు నమోదు  చేయాలని  కోరారు. ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేసింది.