Hyderabad Crime News: హైదరాబాద్ టోలిచౌకీ పారామౌంట్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్మలు ఒకేసారి మృతి చెందారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారులంతా ఒకేసారి చనిపోవడంతో గుండెలు బాదుకుంటున్నారు. వారు ఏడుస్తున్న తీరు చూసి స్థానికులు కూడా కంట తడి పెట్టారు. 


అసలేం జరిగిందంటే..?


టోలిచౌకి పారామౌంట్ కాలనీలో నివాసం ఉంటున్న 19 సంవత్సరాల అనస్, 18 సంవత్సరాల రిజ్వాన్, 16 సంవత్సరాల రజాక్ లు అన్నదమ్ములు. అయితే తమ ఇంట్లోని సంపు వద్ద మోటార్ ఆన్ చేసేందుకు అనస్ ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆయనకు కరెంట్ షాక్ తగిలింది. విషయం గుర్తించిన రిజ్వాన్ అన్నను కాపాడే ప్రయత్నం చేశాడు. కర్రతో కాకుండా చేతితో పట్టి లాగాలని చూశాడు. అదే తప్పైంది. అన్నను పట్టుకున్న తమ్ముడు రిజ్వాన్‌ కూడా విద్యుత్ ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఇంట్లోంచి అప్పుడే బయటకు వచ్చిన తమ్ముడు రజాక్.. అన్నలను చూశాడు. వెంటనే ఏమైందో చూద్దామని దగ్గరకి వెళ్లి వారిని పట్టుకున్నాడు. దీంతో అతడు కూడా విద్యాఘాతానికి గురయ్యాడు.


ఒకేచోట ముగ్గురు అన్నా తమ్ముళ్లు ప్రాణాలు కోల్పోయారు. చేతికి అంది వచ్చిన ముగ్గురు కొడుకులు.. ప్రాణాలు లేకుండా ఒకే చోట పడి ఉండడాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. గుండెలు భాదుకుంటూ రోదిస్తున్నారు. తమను కూడా వెంట తీసుకెళ్లే బాగుండంటూ బావురుమంటున్నారు. వీరి స్థితి చూసిన స్థానికులు కూడా కంటతడి పెడుతున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 


ఫిబ్రవరిలో నిర్మల్ లో కరెంట్ షాక్ తో బాలుడి మృతి


నిర్మల్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. కరెంట్ షాక్ తో బాలుడు మృతి చెందాడు. ఇంటి పెరటిలో కూరగాయల మొక్కల చుట్టూ ఉన్న ఫెన్సింగ్ కు కరెంట్ పెట్టారు. క్రికెట్ బంతి ఆ పెరటిలోకి వెళ్లడంతో అక్కడ పెట్టిన కరెంట్ తీగలు తగిలి బాలుడు మృతి చెందాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన ముదం ఈశ్వర్(11)  ఇంటి పెరటిలో పెట్టిన కరెంట్ తీగలు తగిలి మృతి చెందాడు. ఇంటి యజమాని విఠల్ పరారీల ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.  


కూరగాయల మొక్కల చుట్టు పెట్టిన ఫెన్సింగ్ కు కరెంట్ పెట్టిన రైతులు


"నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సుభాష్ నగర్ లో ఈశ్వర్ అనే బాలుడు క్రికెట్ ఆడుతున్న సమయంలో కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. క్రికెట్ ఆడుతున్నప్పుడు బంతి పక్కింటి పెరటిలో పడింది. బంతి కోసం వెళ్లిన ఈశ్వర్ కూరగాయల మొక్కల చుట్టూ పెట్టిన ఫెన్సింగ్ కరెంట్ పెట్టారు. వీటిని ముట్టుకోవడంతో ఈశ్వర్ చనిపోయాడు. బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం." - ఖానాపూర్ సీఐ వినోద్