దుబ్బాక నియోజకవర్గంలో ఓ బస్టాండు ప్రారంభోత్సవం ఉద్రిక్తతలకు దారి తీసింది. బస్టాండ్‌ కేంద్రంగా దుబ్బాకలో రాజకీయాలు వేడేక్కాయి. కొత్త బస్టాండ్‌ నిర్మిస్తామని ఉప ఎన్నిక సమయంలో హామీగా బీఆర్‌ఎస్‌ (టీఆర్ఎస్), బీజేపీ పార్టీలు చెప్పాయి. అన్న మాట ప్రకారమే రూ.4 కోట్ల ఖర్చుతో ఒక ఏడాదిలోనే బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేసేశారు. ఆ దుబ్బాక బస్టాండ్‌ను మంత్రి హరీశ్ రావు శుక్రవారం (డిసెంబరు 30) ఉదయం ప్రారంభించారు. 


అయితే, ఇప్పుడు ఆ బస్టాండు ఏర్పడినందుకు తామంటే తామే కారణమని బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. కొత్త బస్టాండు క్రెడిట్ తమకే దక్కాలని ఇరు పార్టీల వారు ప్రయత్నిస్తున్నారు. ఉప ఎన్నికలో ఇచ్చిన హామీ ప్రకారం తమను గెలిపించకపోయినా హామీ నిలబెట్టుకున్నామని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. కానీ, తాను కొత్త బస్టాండ్ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం వల్లే నిర్మాణం పూర్తయిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు వాదిస్తున్నారు.


ప్రారంభోత్సవ సమయంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలకు మంత్రి హరీష్‌ రావు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త బస్టాండ్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్టాండ్‌లోకి బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలకు ప్రవేశం నిషేధించారు. బస్టాండ్‌ చుట్టూ బారికేడ్లు పెట్టారు. సిద్ధిపేట సీపీ శ్వేతా దుబ్బాక పరిస్థితిని సమీక్షించారు.


దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌లతో పాటు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా హాజరయ్యారు. ముందుగా హబ్సిపూర్‌లో గోడౌన్ ప్రారంభించారు. అక్కడి నుంచి దుబ్బాక బస్టాండ్ ప్రారంభించేందుకు రెండు పార్టీల కార్యకర్తలు బైక్ లపై ర్యాలీలుగా వెళ్లారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న సమయంలో మంత్రి హరీశ్, ఎమ్మెల్యే రఘునందన్ రావు కలగజేసుకొని ఇరు పార్టీల నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.


ఎంపీ - ఎమ్మెల్యే మధ్య కూడా సవాళ్లు


మరోవైపు, ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి మధ్య కూడా సవాళ్లు జరిగాయి. గతంలో దౌల్తాబాద్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం ఇరు పార్టీల నేతల మధ్య పెద్ద వివాదాలనే రేపింది. గొల్లపల్లి గ్రామంలో శిలాఫలకంపై స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేరు లేకపోవడం పెద్ద గొడవకు దారి తీసింది. దీనికి తోడు మూడు రోజుల క్రితం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి నేరుగా ఎమ్మెల్యే రఘునందన్ రావు లక్ష్యంగా ఓ సవాలు చేశారు. ఎమ్మెల్యే రఘునందన్​ రావు రాజీనామా చేసి కౌన్సిలర్ గా గెలవాలని​ కామెంట్లు చేయడంతో బీజేపీ శ్రేణుల ఆగ్రహం మరింత పెరిగింది.


రెండు రోజుల క్రితం రైతుల సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. సిద్దిపేటలో పబ్ లు కావాలని అడిగిన వ్యక్తికి పేద ప్రజలు, రైతుల సమస్యలు తెలియవని ఎంపీ ప్రభాకర రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ధైర్యం ఉంటే మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని, బీఆర్ఎస్ గెలుస్తదో, బీజెపీ గెలుస్తుందో తెలుసుకోవాలని సవాలు చేశారు.