Siddipet Train :    సిద్దిపేట జిల్లా ప్రజల కల నెరవేరింది. ఎన్నో ఏండ్ల నుంచి  వస్తుంది వస్తుంది అనుకుంటున్న రైలు ఎట్టకేలకు కూత పెట్టింది. దశాబ్దాల వాంఛ అక్టోబర్ 3వ తేదీన సాకారం అయింది. అక్టోబర్ 3వ తేదీన సిద్దిపేట, సికింద్రాబాద్ మధ్య నడిచే పుష్ పుల్  రైలుకు వర్చువల్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ  జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్‌ -మన్మాడ్‌ వెళ్లే మార్గంలో మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి రైల్వేలైన్‌ సిద్దిపేట జిల్లాకు ప్రారంభమవుతుంది.  సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌, సిద్దిపేట మీదుగా సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి వరకు ఈ మార్గం ఉంటుంది. బోయినపల్లి నుంచి కరీంనగర్‌ జిల్లాలోని వెదిర మీదుగా పెద్దపల్లి- నిజమాబాద్‌ వెళ్లే మార్గంలో కొత్తపల్లి దగ్గర ఈ రైల్వే లైన్ కలుస్తుంది.   





 


సిద్దిపేట - సికింద్రాబాద్ ట్రైన్ టైమింగ్ ఇవే                    


07483 నెంబర్ గల ప్యాసింజర్ రైలు..సిద్దిపేటలో ఉదయం 6.45 గంటలకు బయలుదేరి 10.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత సికింద్రాబాద్‌లో 07484 నెంబర్‌ గల  రైలు సికింద్రాబాద్‌ నుంచి ఉదయం 10.35 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.45 గంటలకు సిద్దిపేట చేరుకుంటుంది.  తిరిగి సిద్దిపేటలో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరి..సాయంత్రం 5.10గంటలకు  సికింద్రాబాద్‌కు చేరనుంది.  సాయంత్రం 5.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరనున్న రైలు.. సిద్ధిపేటకు రాత్రి 8.40 గంటలకి చేరుకుటుంది.


నాలుగుదశల్లో  విస్తరణ పనులు                    


మనోహరాద్ కొత్తపల్లి రైల్వే లైన్ పనులు నాలుగైదు దశల్లో పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధి చేశారు అధికారులు. ఇందులో భాగంగా  ఈ రైల్వేలైన్‌ నిర్మాణం మెదక్‌ జిల్లాలో 9.30 కి.మీ , సిద్దిపేట జిల్లాలో 83.40 కి.మీ , రాజన్న సిరిసిల్ల జిల్లాలో 37.80 కి.మీ, కరీంనగర్‌ జిల్లాలో 20.86 కి మీ ఉండనుంది. మొత్తంగా 151.36 కిలోమీటర్ల రైల్వేలైన్‌ నిర్మాణం చేస్తారు.  నాలుగు జిల్లాల్లో మొత్తం 15 రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు.  తొలి దశలో భాగంగా సిద్దిపేట మనోహరాబాద్ రైల్వే లైన్ పూర్తయింది. 116 కిలో మీటర్ల రైల్వే లైన్ పూర్తి కావడంతో రైలు పరుగులు పెట్టి్ంది. ఈ సందర్భంగా  దశాబ్దాల సిద్ధిపేట ప్రజల కల సాకారమైనందుకు తనకు సంతోషంగా ఉందని ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు.


సికింద్రాబాద్ - సిద్దిపేట చార్జి రూ. 60                


 సికింద్రాద్‌ నుంచి సిద్దిపేటకు రైలు మార్గం మొత్తం 116 కిలోమీటర్ల మేర ఉండనుంది.  సికింద్రాబాద్‌లో బయలుదేరనున్న ప్యాసింజర్‌ రైలు.. మల్కాజిగిరి, కెవలరీ బ్యారక్స్‌, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌, మనోహరాబాద్‌, నాచారం, బేగంపేట, గజ్వేల్‌, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్దిపేట స్టేషన్స్‌లో ఆగనుంది. సికింద్రాబాద్‌ నుంచి సిద్దిపేట వరకు రైలు ఛార్జీ రూ. 60గా ఉండనున్నట్లు తెలుస్తోంది.