DK Aruna : మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. గద్వాల నుంచి తన స్థానంలో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపుతామని ప్రకటించారు. గద్వాల నుంచి ఆమె కాకపోతే ఆమె కుమార్తె స్నిగ్ధారెడ్డి పేరును బీజేపీ హైకమాండ్ ఖరారు చేస్తుందని అనుకున్నారు. అయితే తన కుమార్తెకు కూడా సీటు అక్కర్లేదని.. తమ కుటుంబం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయరని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. గద్వాలలో బీజేపీకి అనుకూల పరిస్థితులు లేకపోవడంతోనే ఈ సారి పోటీకి డీకే అరుణ వెనుకంజ వేసినట్లుగాచెబుతున్నారు.
గద్వాలలో పరిస్థితులు బాగోలేవనే పోటీకి దూరంగా ఉంటున్నారా ?
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీకి ఇద్దరు సీనియర్ నేతలు ఉన్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా కీలకంగా ఉన్నారు. వీరిద్దరూ సీట్ల విషయంలో పోటీ పడినట్లుగా తెలుస్తోంది. మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి గత ఎన్నికల్లో డీకే అరుణ పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు. గత ఎన్నికలకు ముందు జితేందర్ రెడ్డి కూడా బీజేపీలో చేరడంతో... ఈ సారి ఆయన కూడా రేసులో ఉంటారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ పోటీకి దూరంగా ఉన్నారు. కానీ ఏపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిధున్ కుమార్ రెడ్డికి మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం కేటాయించారు. ఆయననే పోటీ చేయమన్నా.. తాను పోటీ చేయలేనని.. తన కుమారుడికి చాన్సిస్తే గెలిపించుకుని వస్తానని చెప్పి టిక్కెట్ ఇప్పించుకున్నారు. రెండో జాబితాలో ఆయన కుమారుడి ఒక్కరి పేరే ఉంది.
సీనియర్లతో పోటీ చేయించలేకపోతున్న హైకమాండ్
పార్టీ సీనియర్లు అందరూ బరిలోకి దిగాల్సిందేనని హైకమాండ్ చెప్పినా.. తెలంగాణ సీనియర్లు పోటీకి ససేమిరా అంటున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులను కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపారు. కానీ తెలంగాణకు వచ్చే సరికి.. ముగ్గురు ఎంపీలకు అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చారు కానీ కిషన్ రెడ్డి కూడా పోటీకి దూరంగా ఉన్నారు. అంబర్ పేట నుంచి ఆయన పోటీ చేయడం లేదు. లక్ష్మణ్‌తోపాటు గవర్నర్ పదవి రావడంతో నల్లు ఇంద్రసేనారెడ్డి , ఇతర సీనియర్లు అందరూ దూరంగానే ఉన్నారు. ఇప్పుడు డీకే అరుణ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. వీరందరూ పోటీ చేయాల్సిందేనని బీజేపీ హైకమాండ్ కూడా చెప్పడం లేదు.
బీజేపీ సీనియర్ల తీరుతో పార్టీ వెనుకబడిందని ప్రచారం
బీజేపీలో సీనియర్లు అందరూ పోటీకి దూరంగా ఉండటం వల్ల.. ఆ పార్టీ ఇప్పటికే చేతులెత్తేసిందన్న ప్రచారం రాజకీయవర్గాలు చేస్తున్నాయి. గెలుపుపై నమ్మకం ఉంటే సీనియర్లు టిక్కెట్ల కోసం పోటీ పడేవారని.. పోటీ చేసేది లేదని ఒకరి తర్వాత ఒకరు ఎందుకు వైదొలుగుతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నారు. మొత్తంగా తెలంగాణ బీజేపీలో కీలక బాధ్యతల్లో ఉన్న వారంతా ఎన్నికల బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు.