KCR RajBhavan : గవర్నర్‌ విషయంలో కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వాధినేత కేసీఆర్‌కు ఉన్న అసంతృప్తి తొలగిపోయినట్లుగా కనిపిస్తోంది.  తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిశై సౌందరరాజన్‌తో కలుపుగోలుగా మాట్లాడారు. గతంలో ఉన్న విభేదాల ప్రభావం కనిపించకుండా చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.   రాజ్‌భవన్‌లో జరిగన కార్యక్రమంలో మంగళవారం గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, ఉజ్జల్‌ భూయాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు.  ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మను ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. 


ప్రపంచ చరిత్రలో అతిపెద్ద స్టార్టప్ క్యాంపస్, హైదరాబాద్‌లో నేడే ప్రారంభం


అసోంకు చెందిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ 2011 అక్టోబర్‌ 17న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యారు.2019 అక్టోబర్‌ 3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 అక్టోబర్‌ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. ఆయన తండ్రి సుచేంద్రనాథ్‌ భూయాన్‌ సీనియర్‌ న్యాయవాది. అసోం అడ్వొకేట్‌ జనరల్‌గా కూడా పనిచేశారు. జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ 1964 ఆగస్టు 2న గువాహటీలో జన్మించారు. అక్కడి డాన్‌ బాస్కో ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య, కాటన్‌ కాలేజీలో ఇంటర్‌, దిల్లీలోని కిరోరి మాల్‌ కాలేజీలో డిగ్రీ చేశారు. గువాహటీ ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ, గువాహటీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌ఎం చేశారు. 1991 మే 20న అసోం న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు.


తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణం, హాజరైన సీఎం కేసీఆర్
 
ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత  గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన తేనేటి విందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా త‌మిళిసైతో కేసీఆర్ ముచ్చ‌టించారు. ఇక అక్క‌డే ఉన్న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో కూడా కేసీఆర్ మాట్లాడారు. పలు అంశాలపై ఆహ్లాదంగా మాట్లాడుకున్నారు. పలుమార్లు నవ్వుతూ మాట్లాడుకోవడం  అందర్నీ ఆకర్షించింది. ప్రగతి భవన్ - రాజ్ భవన్ మధ్య ఇప్పటి వరకూ కనిపించిన గ్యాప్ ఇక ఉండదని భావిస్తున్నారు. 


గవర్నర్ రాజ్ భవన్ ముందు ఫిర్యాదుల బాక్స్ పెట్టడం, ప్రజాదర్భార్ నిర్వహించడం వంటి కారణాల వల్ల  సీఎం కేసీఆర్ గవర్నర్‌పై ఆగ్రహంతో ఉన్నారు.  ప్రోటోకాల్  కూడా కేటాయించడం లేదన్న ఆరోపణలను గవర్నర్ చేస్తున్నారు. ఈ క్రమంలో  రాజ్ భవన్‌లో జరిగిన చీఫ్ జస్టిస్ ప్రమాణానికి కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయించుకోవడమే కాదు.. ఆ కార్యక్రమంలో ఆహ్లాదంగా కలివిడిగా ఉండటం  రాజకీయ వాతావరణాన్ని సైతం తేలిక పరిచినట్లయింది.