DGP Anjani Kumar Serious over Medak Third Degree Incident : తెలంగాణలో సంచలనంగా మారిన ఖదీర్ ఖాన్ మృతి వ్యవహారంపై రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ స్పందించారు. అమాయకుడైన ఖదీర్ ఖాన్ మరణానికి కారకులు, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు, కుటుంబ సభ్యులు నుంచి ఫిర్యాదులు రావడంతో సీనియర్ పోలీసు ఆఫీసర్ ను దర్యాప్తు అధికారిగా నియమించాలని ఐజీ చంద్రశేఖర్ పర్యవేక్షించాలని డీజీపీ అంజనీ కుమార్ ఆదేశించారు.


దొంగ అనే అనుమానంతో మెదక్ జిల్లాలో ఖదీర్​ఖాన్ అనే వ్యక్తిపై థర్డ్ ఢిగ్రీ ప్రయోగించారని ఆరోపణలున్నాయి. పోలీసులు థర్డ్​ డిగ్రీ ప్రయోగించిన కారణంగానే అతడు చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డికి చెందిన పోలీస్ అధికారిని విచారణాధికారిగా నియమించి ఘటనపై పూర్తి విచారణ జరపాలని ఐజీ చంద్రశేఖర్​ను డీజీపీ ఆదేశించారు. ఖదీర్ మృతి ఘటనలో బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మెదక్ పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐ లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మెదక్ ఎస్పీని రాష్ట్ర డీజీపీ ఆదేశించారు.


అసలేం జరిగిందంటే..
జనవరి 27వ తేదీన మెదక్ పట్టణంలోని ఓ వీధిలో గొలుసు చోరీ జరిగింది. తన చైన్ చోరీపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి జనవరి 29న ఖదీర్ ఖాన్​ను అదుపులోకి తీసుకున్నారు. గొలుసు చోరీపై ప్రశ్నించగా తనకు తెలియదని చెప్పినా వినకుండా విచారణలో భాగంగా జైళ్లోనే ఉంచారు. ఫిబ్రవరి 2వ తేదీన ఖదీర్ ఖాన్ భార్యకు ఫోన్ చేసి పిలిపించిన పోలీసులు ఆమె వెంట భర్తను పంపించారు. కానీ అంతలోనే ఖదీర్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కొంపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 


ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఖదీర్ ఖాన్ ను హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే ఖదీర్ ఖాన్ ఫిబ్రవరి 16న రాత్రి మృతిచెందాడు. 17వ తేదీన పోస్టుమార్టం చేసిన తరువాత కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. అయితే చోరీ చేసులో తన భర్తను ఇరికించి, పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్లే ఖదీర్ ఖాన్ చనిపోయాడని అతడి భార్య సిద్దేశ్వరి ఆరోపించారు. తన భర్తది సహజ మరణం కాదని, పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే తీవ్ర అస్వస్థతకు లోనై చనిపోయాడని ఉన్నతాధికారులకు ఆమె ఫిర్యాదు చేశారు.


తాను గొలుసు చోరీ చేయలేదని చెప్పినా వినకుండా పోలీసులు తనను హైదరాబాద్ నుంచి కొట్టుకుంటూ తీసుకొచ్చారని చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఖదీర్ ఖాన్ తెలిపారు. ఎస్ఐ రాజశేఖర్ చెప్పడంతో తలకిందులుగా వేలాడదీసి రెండు గంటలపాటు ఐబీకి చెందిన ప్రశాంత్, పవన్ తనను కాళ్లు, చేతులపై కొట్టారని బాధితుడు వాపోవడం తెలిసిందే. ఖదీర్ మరణం తరువాత ఈ కేసుపై ఎంఐఎం స్పందించింది. ఖదీర్‌ఖాన్‌ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మజ్లిస్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొయినోద్దీన్‌, మరికొందరు నేతలు మెదక్‌ జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి ఫిర్యాదు చేశారు.