Adilabad News: ‘ఇందిరమ్మ రాజ్యంలో పోడు భూములకు పట్టాలిస్తాం, చేతులు పట్టుకొని మీ భూములు దున్నిస్తాం.. రుణాలు సైతం ఇస్తాం ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామ’ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం (ఆగస్టు 7) ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. భూ పోరాటాల ద్వారా సంక్రమించిన భూములపై హక్కులు తిరిగి వారు పొందేందుకు ప్రజల మధ్య చర్చ జరగాలి.. అసెంబ్లీ లోను చర్చ జరిపిస్తాం.. అందరి ఆమోదంతో సమగ్ర భూ చట్టం తెస్తామని తెలిపారు. ఎన్నికల ముందు ఏఐసిసి ఆదేశం మేరకు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేశాను.. సీఎల్పీ నేతగా నేను ఓవైపు.. నాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోవైపు ఆదిలాబాద్ నుంచే యాత్రలు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. 


మండుటెండల్లో ప్రారంభించిన నా పాదయాత్ర రెండు రోజులు లేదంటే రెండు గ్రామాలకే పరిమితం అవుతుంది ఆ తర్వాత ఆగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ప్రజల సమస్యలు వింటూ 1365 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేశాను. ఆ పాదయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాం... ప్రజలు చెప్పిన సమస్యల పరిష్కారం కోసం కంకణ బద్ధులమై ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి అంది వచ్చిన అవకాశాన్ని అనుభవించకుండా అధికారం ఒక బాధ్యత అని నడుచుకుంటున్నాం, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏ ఒక్క హామీని మర్చిపోకుండా అమలు చేస్తున్నాం అన్నారు. 


ఇందిరమ్మ ఇళ్లకు ప్రణాళికలు
మొదటి సంవత్సరంలోనే ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. కొద్ది రోజుల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తాం. ఐదు లక్షల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తాం, ఎస్సీ ఎస్టీలకు అదనంగా లక్ష రూపాయలు జత చేసి ఇస్తున్నాం. ఇది ప్రజల ప్రభుత్వం వచ్చే ప్రతి రూపాయి కూడా దుబారా కాకుండా అర్థవంతంగా ప్రజలకే ఉపయోగపడేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.


నాడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట మేరకు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి పేపర్ లీక్ లేకుండా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసామన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం.. మరో 30 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది త్వరలో వారికి నియామక పత్రాలు అందజేస్తామన్నారు. గ్రూప్ వన్, టు, త్రీ, ఎలక్ట్రిసిటీ, సింగరేణిలో ఏడాది మొత్తం ఏ తేదీన ఏ పరీక్ష జరుగుతుందో ఇటీవల జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో విడుదల చేశాం. ఇది ఈ రాష్ట్ర యువత కోసం మా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా వారి స్థితిగతులను మార్చే పనులు చేపడతామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ లో గతంలో కొనసాగిన పథకాలను పునరుద్ధరిస్తాం, అందుకు తాజా బడ్జెట్లో 35 వేల కోట్లకు పైబడి నిధులు కేటాయించినట్లు తెలిపారు. పాదయాత్ర సందర్భంగా బస చేసిన ప్రతి ప్రాంతాన్ని సందర్శిస్తానని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. 
  
నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభిస్తున్నామని, పోటీ పరీక్షలకు హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు పోకుండా నియోజకవర్గ, కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ కోచింగ్ సెంటర్లను త్వరలో ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు. నిష్ణాతులైన వారిచే ఆన్లైన్లో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. ప్రజాయుద్ధనక గద్దర్ అన్న ఆరోగ్యం బాగా లేనప్పటికీ మండుటెండలను సైతం లెక్కచేయకుండా నాతోపాటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకునే నన్ను ఆశీర్వదించారు. ఇప్పుడు ఆయన మన మధ్య లేనప్పటికీ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను గద్దర్ అన్న ఆలోచన విధానాన్నే మా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్నదనీ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాను గుండెల్లో పెట్టుకుని చూసుకునే ప్రభుత్వం మాది అన్నారు. ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో 400 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సంపద సృష్టిస్తాం, పేద ప్రజలకు పంచుతామని డిప్యూటీ సీఎం సభలో తెలిపారు.