బీజేపీ చెప్పేదొకటి, చేసేదొకటని మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు. బీజేపీ నిర్వాకానికి పెద్ద ఉదాహరణ పెద్ద నోట్ల రద్దు అన్నారు. డీమానిటైజేషన్ పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న పార్లమెంటులో ఇచ్చిన సమాధానంతో నిజాలు బయటకు వచ్చాయని అన్నారు. నోట్లరద్దు అట్టర్ ప్లాప్ షో అని కేంద్రం అంగీకరించిందనే విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు.
నోట్లరద్దు గొప్పది కాదు గనుకే బీజేపీ నేతలు దీనిపై మాట్లాడటం లేదన్నారు మంత్రి హరీష్ రావు. మౌనం అంగీకారాన్ని సూచిస్తోందని అన్నారు. నోట్లరద్దుతో నకిలీ కరెన్సీ తగ్గకపోగా 54 శాతం పెరిగిందని తెలిపారు. ఆర్‌బీఐ గణాంకాలే అందుకు సాక్ష్యమన్నారు. నోట్లరద్దు మొదటి లక్ష్యం- దొంగ నోట్లు అరికట్టడం.. కానీ అదే అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. కరెన్సీ చలామణి తగ్గించి డిజిటల్ పేమెంట్స్ పెంచడం నోట్ల రద్దు మరో లక్ష్యం- కానీ ఇది కూడా అట్టర్ ప్లాప్ అయిందన్నారు హరీష్ రావు.
నోట్లరద్దుకు ముందు కరెన్సీ చలామణి జీడీపీలో 11 శాతం ఉంటే, ఇప్పుడు 13 శాతానికి పెరిగిందని విమర్శించారు హరీష్ రావు. పెద్దనోట్ల చలామణి నోట్లరద్దు తర్వాత రెట్టింపు అయ్యిందని ఎద్దేవా చేశారు. రూ. 500, రూ. 1000 నోట్లరద్దు అన్నారు, 2 వేల నోటు తెచ్చారు! పెద్దనోట్ల వాడకం పతిమితం చేయాలనుకున్నారు, కానీ విపరీతం గా పెరిగిందని మండిపడ్డారు.
నోట్లరద్దుతో నల్లధనం ఉండదని లక్ష్యంగా పెట్టుకున్నారు.. దాంట్లో కూడా అట్టర్ ప్లాప్ అయ్యారని హరీష్ అన్నారు. నోట్లరద్దుతో తీవ్రవాద కార్యకలాపాలు, మాదక ద్రవ్యాల రవాణా తగ్గుతాయని భ్రమలు కల్పించారని, ఈ మూడో లక్ష్యం కూడా అట్టర్ ప్లాప్ అయ్యిందని తెలిపారు.
దేశ ఆర్థికవ్యవస్థపై నోట్లరద్దు తీవ్ర ప్రభావం చూపిందన్నారు. 5 లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. నోట్లు మార్చుకోవడానికి లైన్లలో నిలబడి 108 మంది మరణించారని గుర్తు చేశారు. 62 లక్షల మంది ఉపాధి కోల్పోయారని విమర్శించారు. కొత్త నోట్ల ముద్రణకు 21 వేల కోట్లు ఖర్చు పెట్టారు.. ఈ మొత్తం తో ఒక ప్రాజెక్టు పూర్తయి ఉండేదని హరీష్ అభిప్రాయపడ్డారు.
బీజేపీ వేసే ప్రతి అడుగు పేదప్రజల పై పిడుగులా పడిందన్నారు హరీష్ రావు. నీతి ఆయోగ్ నేతి బీరకాయలో నెయ్యి చందంగా మారిందని విమర్శించారు. అప్పులు చేయడం తప్పులు చేయడం బీజేపీ విధానంగా మారిందని మండిపడ్డారు. కేంద్రం ప్రతిరోజూ చేస్తున్న అప్పు రూ. 4,618 కోట్లని అన్నారు. రైతు నల్లచట్టాలపై క్షమాపణ చెప్పిన ప్రధాని.. నోట్లరద్దుపై కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దుపై తక్షణమే శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు మంత్రి హరీష్ రావు. విదేశీ మారక నిల్వలు, రూపాయి విలువ రోజురోజుకు తగ్గిపోతున్నాయని అన్నారు. బీజేపీది డొల్ల ప్రచారమనీ, ప్రజలను భ్రమల్లో ఉంచడం బీజేపీ విధానమని చెప్పుకొచ్చారు. బీజేపీ వాగ్దానాల అమలుపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అన్నిట్లో దేశాన్ని దిగజార్చిన బీజేపీ మతపిచ్చి పెంచడంలో మాత్రం విజయం సాధించిందని ఎద్దేవా చేశారు. బీజేపీ కో హాఠావో, దేశ్ కో బచావో తమ నినాదమని సమావేశం ముగించారు.