Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా మేయర్ సహా ఇద్దరు కార్పొరేట్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దిల్లీలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో మేయర్ సహా ఇద్దరు కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బడంగపేట్ కార్పొరేషన్ మేయర్ చుగురింత పారిజాత నరసింహా రెడ్డి దంపతులు, బడంగపేట్ 20వ డివిజన్ కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి, 23వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస రెడ్డి ఇవాళ కాంగ్రెస్ లో చేరారు. 


పట్టణాల్లో సమస్యలు 


పట్టణాల సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కనీస సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించలేకపోయిందన్నారు. చిన్న చిన్న సమస్యలు కూడా ప్రభుత్వం తీర్చడం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి పనుల కోసం టీఆర్ఎస్ లీడర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందని ఆరోపించారు. ఇంతకాలం టీఆర్ఎస్ తో కలిసి పని చేసినా ప్రజా సమస్యలు తీర్చడం లేదని, అందుకే ఆ పార్టీని వీడుతున్నారన్నారు. 2004 నుంచి 2014 వరకు రాష్ట్రం అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ పరిపాలించిన సమయంలో అనేక ప్రజాపథకాలను తీసుకొచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. 


కాంగ్రెస్ చేసిన అభివృద్ధే 


హైదరాబాద్ అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వాల పాత్ర కీలకం. ఔటర్ రింగ్ రోడ్, ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్, ఎక్స్ ప్రెస్ హైవే, ఐటీ పరిశ్రమలు అన్ని కాంగ్రెస్ సమయంలో అభివృద్ధి చెందాయి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ ను విశ్వనగరంగా చేస్తానని చెప్పారు కానీ హైదరాబాద్ లో చిన్న వర్షం వస్తేనే మునిగిపోతుంది. 
టీఆర్ఎస్ మీద నమ్మకం లేకనే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది జాయిన్ అవుతున్నారు. మహేశ్వరం డివిజన్ సంబంధించిన కార్పొరేటర్లు, మేయర్ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి చెందుతుందని పార్టీలో చేరారు.  ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని రాహుల్ గాంధీ వారికి సూచించారు. 


చిల్లర మాటలు 


కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. డీజిల్ గ్యాస్ ధరలు రెట్టింపు స్థాయిలో పెరిగాయన్నారు.  దేశంలో మత సామరస్యం దెబ్బతిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని, రాష్ట్రం దివాళా తీసిందన్నారు. అన్యాయంగా సంపాదించిన సొమ్ముతో బలప్రదర్శన చూపించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్కదారి పట్టించిందికే ఇలాంటి ప్రదర్శనలు చేస్తు్న్నారని ఆరోపించారు. బీజేపీ సభ సందర్భంగా బీజేపీ టీఆర్ఎస్ నేతలు వారం రోజుల పాటు చిల్లర చిల్లర మాటలు మాట్లాడుకున్నారన్నారు. చివరికి ఫ్లెక్సీలో విషయంలో కూడా తిట్టుకున్నారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించిందన్నారు. రాష్ట్రంలో విభజన హామీలు చాలా పెండింగ్ లో ఉన్నాయని వాటిని పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్ లో ఉన్న అనేక సమస్యలపై మోదీ ఎందుకు మాటల్లేదని మండిపడ్డారు. 


టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి 


మేయర్ పారిజాత రెడ్డి మాట్లాడుతూ.. నేను గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లోకి వెళ్లాను. స్థానిక సమస్యల కోసం అనేక ప్రయత్నాలు చేశాను. చిన్న చిన్న సమస్యలు తీర్చడానికి కూడా ఇబ్బందిగా ఉంది. స్థానిక సమస్యలు పైవారికి తెలిసే ప్రయత్నం చేసిన అది చేరట్లేదు. ప్రజాసమస్యలు తీర్చలేక పోవడంతో నిరాశతో ఉన్నాం. టీఆర్ఎస్ లో ఉంటే కష్టసాధ్యంగా ఉంది. అందుకో మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి చేరాం అన్నారు.