Revanth Reddy : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. దిల్లీలో మాట్లాడిన ఆయన... ఈ లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఉందన్నారు. కేటీఆర్ తత్తర, తొందరపాటు చూస్తే జనానికి స్పష్టంగా అర్థమవుతుందన్నారు. లీకేజీకి పాల్పడిన వ్యక్తుల మధ్య గొడవతో ఇది బయటపడిందన్నారు. రాష్ట్రంలో సంచలన ఘటనలు జరిగినప్పుడు, అందులో ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడినప్పుడు, పక్కదారి పట్టించడం కోసం మాత్రమే సిట్ ఏర్పాటు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ప్రశ్న పత్రాల లీకేజీ, అమ్మకం కుంభకోణంలో కూడా అలాగే చేశారన్నారు. ఐటీ శాఖ మంత్రికి సంబంధం ఏంటని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని, TSPSCలో ఛైర్మన్ సహా అర్హత లేని 7 గురి నియామకంతోనే అవకతవకలకు పునాది వేశారన్నారు. కావలసిన వ్యక్తులను ప్రత్యేకంగా కూర్చోబెట్టి పరీక్షలు రాయించారని ఆక్షేపించారు. వీటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చిందని మండిపడ్డారు. 


కేటీఆర్ కు ఎందుకు నోటీసులివ్వడంలేదు? 


"ప్రశ్న పత్రాల లీకేజీ బయటపడ్డ తర్వాత ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది అంటూ కేటీఆర్ చెప్పారు. అప్పటికి నిందితులను కస్టడీలోకి కూడా తీసుకోలేదు, విచారణ జరగలేదు. విచారణ జరగకముందే కేటీఆర్ కు ఈ విషయం ఎలా తెలిసింది? కేటీఆర్ పీఏ తిరుపతి, రాజశేఖర్ రెడ్డి పక్క పక్క మండలాలకు చెందినవారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా రాజశేఖర్ రెడ్డిని చేర్చుకోవడంలో తిరుపతి పాత్ర ఉంది. ఇప్పుడు కేటీఆర్ మళ్లీ బయటికి వచ్చి, తన పీఏ మీద ఆరోపణలు చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు. సిట్ పూర్తి కాకముందే, కోర్టుకు నివేదికలు అందించకముందే కేటీఆర్ కు సమాచారం ఎలా వస్తుంది? కేటీఆర్ కు నోటీసు ఇచ్చి ప్రశ్నించాలని నేను సిట్ అధికారిని డిమాండ్ చేశాను. కేటీఆర్ కు నోటీసు ఇవ్వడం మాని, నాకు నోటీస్ ఇచ్చారు." - రేవంత్ రెడ్డి


కేటీఆర్ పీఏ ఒక పావు మాత్రమే 


కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ జరుగుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ పీఏ తిరుపతి ఒక పావు మాత్రమే అన్నారు. ఇందులో కేటీఆర్ పాత్ర పూర్తిగా ఉందని నేను పునరుద్ఘాటిస్తున్నానన్నారు. లీకేజీపై ప్రశ్నించినందుకు మాకు నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు.  గత రెండు మూడు రోజులుగా సీబీఐ, ఈడీ అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ రెండు సంస్థల డైరెక్టర్లు నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. ఒక ఎంపీగా నేను అపాయింట్మెంట్ అడిగితే వాళ్లు ఇవ్వాల్సిందే అన్నారు. లీకేజీ వ్యవహారంలో కోట్ల రూపాయల కుంభకోణం, మనీలాండరింగ్ జరిగిందని ఆరోపించారు. హవాలాతోపాటు విదేశాల్లో లావాదేవీలు జరిగాయన్నారు. ఇందులో పాలకులు, ప్రభుత్వాధికారుల పాత్ర ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ చట్టాలు వర్తిస్తాయన్నారు. సిట్ అధికారి అవినీతి నిరోధక చట్టం కింద ఒక్క సెక్షన్ కూడా పెట్టలేదన్నారు. తద్వారా ముఖ్యమైన వ్యక్తులను కాపాడేందుకు సిట్ అధికారి ప్రయత్నిస్తున్నారన్నారు. అందుకే సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాల్సిందే అని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.