Minister KTR : దిల్లీలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరీతో గురువారం సమావేశమయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్ మురుగునీటి పారుదల ప్లాన్‌కు ఆర్థిక సాయం అందించాలని కేంద్రమంత్రిని కోరారు. ఎస్‌టీపీల నిర్మాణాలకు రూ.8,654.54 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టు వ్యయంలో మూడో వంతు అమృత్-2 కింద రూ.2,850 కోట్లు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌లో వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్‌కు సహకరించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర మంత్రికి ఈ మేరకు లేఖలు అందించారు.
అమృత్ పథకం కింద నిధులివ్వండి
మురుగునీటి నిర్వహణ ప్రణాళికా ప్రకారం 62 ఎస్‌టీపీ ప్లాంట్లను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కేటీఆర్ లేఖలో తెలిపారు. ఎస్‌టీపీ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.8,684.54 కోట్లు అంచనా వేశారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వ్యయంలో మూడోవంతు అమృత్-2 పథకం కింద రూ.2,850 కోట్లు మంజూరు చేయాలని కేంద్రమంత్రిని విజ్ఞప్తి చేశారు. మిగతాదంతా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని లేఖలో మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎస్టీపీ ప్రాజెక్టులు పూర్తయితే వందశాతం మురుగునీటి శుద్ధిని చేయడమే కాకుండా మూసీ నది, ఇతర నీటి వనరులకు మురుగు నీటి కాలుష్యాన్ని తగించే అవకాశం ఉందన్నారు.
అర్బన్ మొబిలిటీ
దీంతో పాటు వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్‌కు సహకరించాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ కోరారు. పెరుగుతున్న జనాభా, ఉపాధి అవకాశాలతో హైదరాబాద్ మహానగరంగా రూపుదిద్దుకుటుందన్నారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు 69 కి.మీ మెట్రో రైలు నెట్‌వర్క్, 46 కి.మీ సబ్ అర్బన్ సేవలు, ఎమ్‌ఎమ్‌టీఎస్ హైదరాబాద్‌లో ఉందని కేటీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మెట్రో రైల్, ఎంఎంటీఎస్‌లకు ఫీడర్ సేవలుగా పనిచేసేందుకు వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్, రోప్‌వే సిస్టమ్స్ వంటి స్మార్ట్ అర్బన్ మొబిలిటీ సొల్యూషన్స్ కోసం తెలంగాణ ప్రయత్నిస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read : జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, జీతాలు పెంచాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన